Jailer 2 Announcement Teaser: జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్ వచ్చేసింది.. స్వాగ్‍తో అదరగొట్టిన రజినీ: చూసేయండి
Jailer 2 Announcement Teaser: జైలర్ 2పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అనౌన్స్‌మెంట్ కోసం ఓ వీడియోను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది. రజినీ స్వాగ్‍తో టీజర్ అదిరిపోయింది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. చాలాకాలం తర్వాత తన రేంజ్ హిట్ సాధించారు రజినీ. 2023 ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా రజినీ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో జైలర్ 2పై ఎప్పుడు అప్‍డేట్ వస్తుందా అని విపరీతంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చేసింది. అనౌన్స్‌మెంట్ టీజర్ నేడు (జనవరి 14) రిలీజ్ అయింది.
నెల్సన్, అనిరుధ్‍తో..
పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా నేడు జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ముందుగా ఈ టీజర్‌లో దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రిలాక్సింగ్ మోడ్‍లో ఉంటారు. అంతలో ఓ వ్యక్తి బయటి నుంచి ఎగిరిపడి వారి ముందు పడతాడు. ఆ తర్వాత మరికొందరు కూడా అద్దాలు పగులగొట్టుకొని ఇంట్లో పడతారు. ఇంతలో బులెట్స్ దూసుకొస్తాయి. భయంతో వణికిపోతారు నెల్సన్, అనిరుధ్.
రజినీ స్వాగ్ అదుర్స్
అప్పుడే రజినీకాంత్ కత్తి పట్టుకొని స్వాగ్‍తో ఎంట్రీ ఇస్తారు. భయంతో నెల్సన్, అనిరుధ్ దుప్పటికప్పుకుంటే.. అది తీసి రౌడీలు ఎక్కడికి వెళ్లారని అడుగుతారు. ఓ గ్రనైడ్ వచ్చి ముందు పడితే చేతిలోకి తీసుకుంటాడు నెల్సన్. దీంతో ఇల్లు పేలిపోతుంది. రౌడీలు గన్‍లు పట్టుకొని రెడీగా ఉంటే.. అలా కళ్లద్దాలు తీస్తాడు రజినీ. దీంతో వెనుక నుంచి మిసైల్స్ వచ్చి రౌడీల జీపులను పేల్చేస్తాయి. బ్లాస్ట్ జరుగుతుంది. అద్దాలను స్టైలిష్‍గా పెట్టుకుంటారు రజినీ. ఇదే సినిమాగా చేస్తామంటూ కిటికీలో నుంచి చూస్తున్న నెల్సన్, అనిరుధ్ మాట్లాడుకుంటారు. వెనుక కార్లు బ్లాస్ అయి ఎగిరిపోతుంటే.. రజినీ అలా నడిచి వచ్చే షాట్ వావ్ అనిపించేలా ఉంది. హుకుం బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍గా ప్లే అవుతూ ఉంటుంది. మొత్తంగా ఈ అనౌన్స్‌మెంట్ టీజర్ క్రియేటివిటీ, ఫన్, రజినీ స్వాగ్‍తో అదిరిపోయింది. షూటింగ్ త్వరలో మొదలవుతుందని టీజర్లో చెప్పేశారు మేకర్స్. జైలర్ మూవీలో ముత్తువేల్ పాండియన్ పాత్రను రజినీ పోషిస్తున్నారు.
జైలర్ చిత్రం 2023 ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా సుమారు రూ.650 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో స్వాగ్, స్టైల్, యాక్షన్‍తో రజినీ దుమ్మురేపారు. వినాయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ నెల్సన్ టేకింగ్ ప్రేక్షకులను మెప్పించింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. సీక్వెల్‍గా రానున్న జైలర్ 2కు క్రేజ్ మరో రేంజ్‍లో ఉంది.
సంబంధిత కథనం