మలయాళం మూవీ జాక్సన్ బజార్ యూత్ తెలుగులోకి వచ్చింది. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. జక్సాన్ బజార్ గ్యాంగ్ పేరుతో డబ్ అయిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో లక్‌మన్ అరవన్, జాఫర్ ఇడుక్కి, ఇంద్రాస్ కీలక పాత్రల్లో నటించారు. షామల్ సులేమాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
2023లో మలయాళంలో జాక్సన్ బజార్ గ్యాంగ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. తెలుగులోకి మాత్రం రెండేళ్ల తర్వాత వచ్చింది. వయలెన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, పోలీసులు ఇంటరాగేషన్స్ సీన్స్‌లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. స్టార్ కాస్ట్ లేకుండా కొత్త నటీనటులతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కమర్షియల్‌గా మోస్తారు వసూళ్లను రాబట్టింది.
అప్పు, వేలయాన్ జాక్సర్ బజార్‌లో బ్యాండ్ మాస్టర్లుగా పనిచేస్తుంటారు. సొంతంగా వారికి ఓ బ్రాండ్ ట్రూప్ ఉంటుంది. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకొని జీవిస్తుంటారు. తమ కాలనీకి జాక్సర్ బజార్ అని పేరుపెట్టుకుంటారు. వారి స్థలంపై ఓ పొలిటికల్ లీడర్ కన్నేస్తాడు. ఆ ఏరియా నుంచి నేషనల్ హైవే వెళ్లేలా ఓ ప్రపోజల్ పెడతాడు.
చాలా ఏళ్లుగా ఉంటున్న ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి అప్పు, వేలయాన్ ఒప్పుకోరు. వారిపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడతారు పోలీసులు. మరోవైపు రేప్ కేసులో అప్పు అనుమానితుడిగా మారుతాడు. అసలు నిజంగా అతడు ఆ నేరం చేశాడు? ఈ కేసు నుంచి బయటపడటానికి అప్పుతో పాటు అతడి స్నేహితులు ఏం చేశారు? జాక్సన్ బజార్‌ను వాళ్లు ఎలా కాపాడుకున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
జాక్సర్ బజార్ గ్యాంగ్ మూవీకి 96 ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 5.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు మేకర్స్ ప్రకటించారు. జాఫర్ ఇడుక్కి, ఇంద్రాస్ మలయాళంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతోన్నారు. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తోన్నారు.
సంబంధిత కథనం