Sunny Deol: మరో బాలీవుడ్ ప్రముఖుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా చెబుతున్నాడు. తాను కూడా ముంబైని వదిలి సౌత్ లో సెటిలవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పడం విశేషం. అతని పేరు సన్నీ డియోల్. ఈ మధ్యే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ముంబైని వదిలి సౌత్ సినిమా కోసం వచ్చేసిన విషయం తెలిసిందే.
పుష్పలాంటి మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సన్నీ డియోల్ నటిస్తున్న జాట్ మూవీ రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ సోమవారం (మార్చి 24) రిలీజైంది. ఈ సందర్భంగా సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన సన్నీ డియోల్.. తాను కూడా సౌత్ లో సెటిలవ్వాలని భావిస్తున్నట్లు చెప్పడం విశేషం.
“బాంబే ప్రొడ్యూసర్లు వీళ్లను చూసి నేర్చుకోవాలి. మీరు బాలీవుడ్ అని పిలుస్తారు. కానీ అది హిందీ సినిమా. ప్రేమతో ఎలా సినిమాలు చేయాలో వీళ్లను చూసి నేర్చుకోండి. వీళ్లందరితో కలిసి సినిమా చేయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. మరో సినిమా చేద్దామని నేను వాళ్లతో అన్నాను. నేను కూడా వెళ్లి సౌత్ లోనే సెటిల్ కావచ్చేమో” అని సన్నీ డియోల్ అన్నాడు.
సౌత్ సినిమాతో పోలిస్తే హిందీ సినిమా వెనుకబడిందా అన్న ప్రశ్నకు కూడా సన్నీ డియోల్ స్పందించాడు. కార్పొరేట్లు వచ్చిన తర్వాత సినిమా మరీ కమర్షియల్ అయిపోయిందని అతడు వాపోయాడు. “గతంలో డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ కు ఆ కథ నచ్చేది.
ఆ తర్వాత ఆ సినిమా తీయడానికి నిర్ణయించేవాళ్లు. ఆ తర్వాత కార్పొరేట్లు రంగంలోకి దిగాయి. ఇక పూర్తిగా కమర్షియల్ గా మారిపోయింది. ఈ క్రమంలో సినిమా మేకింగ్ లో ఆసక్తి కోల్పోయారు. ప్రతి ఒక్కరూ బాధితులయ్యారు. సినిమా తీయాలన్న ఆకలి ఉన్న వాళ్లు వెనుకబడిపోయారు” అని సన్నీ డియోల్ అన్నాడు.
జాట్ మూవీని మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇదొక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ. హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీలో సన్నీ డియోల్ తోపాటు రణ్‌దీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనాలాంటి వాళ్లు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో ఈ జాట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం