IT Raids: మూడో రోజు టాలీవుడ్‌లో ఐటీ దాడులు - భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్!
IT Raids: టాలీవుడ్ ఐటీ దాడులు మూడో రోజు కొనసాగుతోన్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్లతో వారికి ప్రొడక్షన్‌లో సహాయం చేస్తోన్న ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులలో అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. ఈ ఐటీ దాడుల కారణంగా భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్ పడినట్లు సమాచారం.
ఐటీ దాడులు టాలీవుడ్ వర్గాల్లో కలకలాన్ని రేపుతోన్నాయి. దిల్‌రాజు, మైత్రీ అధినేతలు నవీన్ యెర్నేని, రవి శంకర్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఆదాయాలు, వ్యయాలు, బాక్సాఫీస్ లెక్కలు, సినిమాల బడ్జెట్‌లపై ఐటీ అధికారులు ఆరాలు తీస్తోన్నారు.
మూడో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతోన్నాయి. ప్రొడ్యూసర్లతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోన్న ఫైనాన్షియర్లు, సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. దిల్ రాజు సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తోన్న సత్య రంగయ్యతో పాటు సినిమా ప్రొడక్షన్స్‌లో నిర్మాతలకు సపోర్ట్‌గా ఉంటోన్న రిలయన్స్ శ్రీధర్, కిషోర్, మ్యాంగో రామ్ ఆఫీస్‌లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
రెమ్యూనరేషన్లపై ఆరాలు...
ఇప్పటికే దిల్‌రాజు, మైత్రీ మూవీస్ అధినేతలతో పాటు అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సహా పలువురు టాప్ ప్రొడ్యూసర్లకు చెందిన వ్యాపార లావాదేవీలు, పెట్టుబబడులు, బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది.
సినిమాల ద్వారా నిర్మాతలకు వస్తోన్న ఆదాయాలకు, పన్ను చెల్లింపులకు మధ్య ఉన్న తేడాలపై కీలకమైన సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హీరోలకు, డైరెక్టర్లకు ఇస్తోన్న రెమ్యూనరేషన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
భారీ బడ్జెట్ సినిమాలపై
ఐటీ దాడుల ఎఫెక్ట్ భారీ బడ్జెట్ సినిమాలపై గట్టిగానే పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా వరకు నిర్మాతలు ఫైనాన్షియర్ల సపోర్ట్‌తోనే సినిమాల నిర్మాణం చేపడుతుంటారు. సినిమాల నిర్మాణానికి ఫైనాన్షియర్ల నుంచి వచ్చే డబ్బే కీలకంగా ఉంటుంది. ఓటీటీ, శాటిలైట్ , థియేట్రికల్ రైట్స్ అడ్వాన్సుల రూపంలో నిర్మాతలకు మోస్తారు ఆదాయమే సమకూరుతుంది.
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు సినిమాల నిర్మాణానికి డబ్బు సాయం చేయడానికి ముందుకు రావు. ఈ నేపథ్యంలో నిర్మాతలు చాలా వరకు ఫైనాన్షియర్లపై ఆధారపడుతుంటారు. ఐటీ దాడుల నేపథ్యంలో నిర్మాతలకు సాయం చేయడానికి ఫైనాన్షియర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. సాయం చేసి తాము రిస్క్‌లో పడకూడదనే ఆలోచనతో సైలెంట్ అయినట్లు చెబుతోన్నారు.
దాంతో భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ దాడుల ఎఫెక్ట్ కొంత పడిందని, చాలా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు.
మా ఇంటికి వస్తారు కావచ్చు...
వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఐటీ రైడ్స్ కారణంగా ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు హాజరుకాలేకపోయారు. ఈ ఐటీ రైడ్స్‌పై సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి రియాక్ట్ అయ్యాడు. దిల్‌రాజు ఒక్కరిపైనే కాకుండా టాలీవుడ్‌లోని అందరిపై ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని, ఇదంతా కామన్ అని చెప్పారు. మా ఇంటికి కూడా ఐటీ అధికారులు వస్తారేమో అంటూ కామెంట్స్ చేశాడు.