Iratta Movie Review: ఇరాట్టా మూవీ రివ్యూ - జోజు జార్జ్ డ్యూయల్ రోల్ మూవీ ఎలా ఉందంటే
Iratta Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ సినిమా ఇరాట్టా నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈసినిమాకు రోహిత్ ఎంజి కృష్ణన్ దర్శకత్వం వహించాడు.
Iratta Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ఇరాట్టా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రోహిత్ ఎం.జి కృష్ణన్ దర్శకత్వం వహించాడు.
ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ మురళి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ మలయాళ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇరాట్టా సినిమా ఎలా ఉందంటే...
పోలీస్‌ను హత్య చేసింది ఎవరు?
వగమాన్ పోలీస్ స్టేషన్‌లో మినిస్టర్ ముఖ్య అతిథిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తోంటారు.ఆ మీటింగ్‌కు సాధారణ ప్రజలతో పాటు మీడియా కూడా కవరేజ్ కోసం వస్తారు. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం ప్రారంభమవుతోండగా పోలీస్ స్టేషన్ నుంచి గన్ సౌండ్స్ వినిపిస్తాయి. లోపలికి వెళ్లిచూడగానే ఏఎస్ఐ వినోద్ ((జోజు జార్జ్) చనిపోయి ఉంటాడు.
ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. ఆ ముగ్గురిలో ఒకరు వినోద్‌ను హత్య చేసి ఉండవచ్చని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తంచేశారు. మరోవైపు అదే పోలీస్ స్టేషన్ ఏరియాలో డిప్యూటీ ఎస్‌పీగా పనిచేస్తోన్న వినోద్ అన్నయ్య ప్రమోద్‌కు(జోజు జార్జ్) కూడా ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తుంటారు.
వినోద్ హత్య గురించి ఒక్కొక్కరిని విచారించడం మొదలుపెడతారు. పోలీసుల విచారణలో వినోద్ గురించి వెల్లడైన నిజాలేమిటి? అన్నయ్య ప్రమోద్‌ను అనుక్షణం వినోద్ ఎందుకు ద్వేషిస్తుంటాడు? అసలు వినోద్ హత్య చేయబడ్డాడా?ఆత్మహత్య చేసుకున్నాడా?
సోదరుడి మర్డర్ మిస్టరీని ప్రమోద్ ఎలా సాల్వ్ చేశాడు? వినోద్ తో సహజీవనం చేస్తోన్న మాలినితో(అంజలి) పాటు ప్రమోద్ భార్య పిల్లలకు అతడి మరణంతో ఏదైనా సంబంధం ఉన్నదా అన్నదే(Iratta Movie Review) ఈ సినిమా కథ.
ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్...
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రోహిత్ ఎం.జి కృష్ణన్ ఇరాట్టా సినిమాను రూపొందించారు. సాధారణంగా ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో హత్యానేరాలకు సంబంధించిన చిక్కుముడులను పోలీసులు రివీల్ చేసినట్లుగా చూపిస్తుంటారు.
కానీ ఓ పోలీస్ అది కూడా స్టేషన్‌లోనే మీడియా, ప్రజల సమక్షంలో చనిపోవడం అనే పాయింట్ చుట్టూ చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపించారు దర్శకుడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో డిఫరెంట్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
క్లైమాక్స్ బలం
వినోద్ పోలీస్ స్టేషన్‌లో చనిపోయే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అనుమానితులు ఒక్కొక్కొరు వినోద్‌తో తమకు ఉన్నగొడవల గురించి చెప్పడం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో అతడి హత్యకు గల కారణాల్ని రివీల్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటుంది.
చివరకు వినోద్‌ను అతడు సోదరుడు ప్రమోద్ చంపినట్లుగా అనుమానం పడటం, దాంతో కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న ప్రమోద్ ఆ మిస్టరీని చేధించే సీన్స్‌ను దర్శకుడు ఊహలకు అందకుండా పకడ్బందీగా(Iratta Movie Review) రాసుకున్నారు.
షాకింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు. అసలు వినోద్ హత్యకు ప్రేరేపించిన సన్నివేశం సినిమాకు హైలైట్. అది ఏమిటన్నది రివీల్ చేస్తే కథ మొత్త తెలిసిపోతుంది. మానవ సంబంధాల నేపథ్యంలో వచ్చే ఈ క్లైమాక్స్‌ను జీర్ణించుకోవడం కష్టమే.
జోజు జార్జ్ నట విశ్వరూపం
ఇలాంటి సెన్సిటివ్ స్టోరీస్‌తో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కథను డీల్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా దారుణంగా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. కానీ దర్శకుడు రోహిత్ రాసిన కథను నమ్మడమే కాకుండా డ్యూయల్‌లో రోల్‌లో నటిస్తూ స్వయంగా తానే నిర్మించారు జోజో జార్జ్. నటుడిగా తానేంత భిన్నమో మరోసారి ఇరట్టా సినిమాతో చాటుకున్నాడు.
వినోద్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అసమాన నటనను కనబరిచాడు. రెండు క్యారెక్టర్స్‌లో చక్కటి వేరియేషన్ చూపించాడు. మాలినిగా అంజలి పాత్రకు సింగిల్ డైలాగ్ కూడా ఉండదు. మిగిలిన పాత్రధారుల యాక్టింగ్ కథకు తగ్గట్లుగా చక్కగా కుదిరింది.
Iratta Movie Review -డిఫరెంట్ ఫిల్మ్
రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే భిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించే మూవీ ఇది. జోజు జార్జ్ యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇరాట్టా సినిమా చూడటం పూర్తిచేసినా క్లైమాక్స్ మాత్రం మన మనసుల్ని అంత సులభంగా వదిలిపెట్టదు.