Indra Re-Release Advance Bookings: చిరంజీవి ఇంద్ర రీరిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డుల మోత
Indra Re-Release Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు తిరగరాస్తోంది. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
Indra Re-Release Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈసారి అభిమానులకు మరింత స్పెషల్ కానుంది. ఈ రీరిలీజ్‌ల కాలంలో చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర కూడా 4కే వెర్షన్ లో మరోసారి వస్తోంది. ఆగస్ట్ 22న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు వైజయంతీ మూవీస్ చాలా రోజుల కిందటే అనౌన్స్ చేయగా.. శనివారం (ఆగస్ట్ 17) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఇంద్ర రీరిలీజ్ రికార్డులు
2002లో వచ్చిన ఇంద్ర మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టర్ చిరంజీవి కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఇది కూడా ఒకటి. జులై 24, 2002లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా రాబోతోంది. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా.. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. దీంతో ఆయా థియేటర్లలో కొత్తగా షోలను యాడ్ చేస్తున్నారు.
అంతేకాదు ఇంద్ర మానియాను కొనసాగించడానికి వైజయంతీ మూవీస్ కూడా బాగానే ప్రయత్నిస్తోంది. ఈ మూవీ రీరిలీజ్ సందర్భంగా ప్రత్యేక మర్చండైజ్ తీసుకొచ్చింది. ఇంద్ర మూవీ టీషర్ట్స్ ను అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఈ మూవీలోని గూస్‌బంప్స్ సీన్లను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. అభిమానుల్లో మరింత ఆసక్తి రేపుతోంది.
ఈ సందర్భంగా మూవీలోని చిరంజీవి వీణ స్టెప్పు వీడియోను కూడా పోస్ట్ చేసింది. బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఇంద్ర మూవీ 22 ఏళ్ల కిందట ఓ సంచలనంగా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్‍లు ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటాయి. అంతేకాదు మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇంద్ర మూవీలో చిరు సరసన సొనాలీ బింద్రె, ఆర్తి అగర్వాల్ నటించారు.
ఇక చిరంజీవి కాకుండా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమ నటనతో మెప్పించారు. అలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇప్పుడు మరోసారి 4కే వెర్షన్ లో రీరిలీజ్ కానుండటం మెగా అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఈసారి చిరు బర్త్ డేను మరింత ఘనంగా, మరుపురాని విధంగా జరుపుకోవడానికి లక్షల మంది ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.