Highest Profits Indian movie: రూ.15 కోట్ల బడ్జెట్.. రూ.900 కోట్ల కలెక్షన్లు.. అత్యధిక లాభాలు వచ్చిన ఇండియన్ సినిమా ఇదే
Highest Profits Indian movie: కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమాకు రూ.900 కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న సంగతి తెలుసా? ఇది ఇండియాలో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా కావడం విశేషం.
Highest Profits Indian movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది అంటే అందరూ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ పేరు చెబుతారు? కానీ అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా మాత్రం ఇది కాదు. దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైనే వసూలు చేసినా.. ఆ మూవీ బడ్జెట్ కంటే 25 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. కానీ బడ్జెట్ కంటే 60 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?

ఈ ఇండియన్ సినిమాకు అత్యధిక లాభాలు
దంగల్ తోపాటు బాహుబలి, పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు రూ.1000 కోట్లకుపైనే వసూలు చేశాయి. కానీ వాటి బడ్జెట్ తో పోలిస్తే ఈ సినిమాలన్నీ మహా అయితే ఐదారు రెట్లు ఎక్కువ వసూలు చేశాయి. కానీ 2017లో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్ అనే ఓ సినిమా ఉంది. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.900 కోట్లు వసూలు చేసింది.
అంటే బడ్జెట్ కంటే 60 రెట్లు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. ఆ రకంగా ఇండియన్ సినిమాలో అత్యధిక లాభాలు గడించిన సినిమాగా ఈ సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్.. జైరా వసీం అనే నటితో తీసిన సినిమా ఇది. పెద్ద స్టార్లు ఎవరూ లేరు. భారీ బడ్జెట్ తో తీసిన యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ కూడా లేవు.
అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఏకంగా రూ.900 కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. దంగల్ మూవీలాగే ఈ సినిమాకు కూడా ఎక్కువ భాగం చైనా నుంచే వసూళ్లు వచ్చాయి. ఈ సీక్రెట్ సూపర్‌స్టార్ వసూళ్లలో 90 శాతం ఒక్క చైనా నుంచే రావడం విశేషం. ఓ ఫిమేల్ లీడ్ సినిమాకు వచ్చిన అత్యధిక వసూళ్లు కూడా ఇవే.
సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీ ఏంటి?
సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో ఆమిర్ ఖాన్ మాత్రమే అతిథి పాత్రలో నటించాడు. అప్పటికి 15 ఏళ్ల వయసున్న జైరా వసీం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇండియాలో ఈ సినిమా రిలీజై రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అందులో రూ.64 కోట్ల నెట్ వసూళ్లు ఉన్నాయి. ఇక ఓవర్సీస్ నుంచి మరో రూ.65 కోట్లు వచ్చాయి. ఆ లెక్కన మొదటిసారి రిలీజైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
నిజానికి అసలు హీరో కూడా లేని ఈ చిన్న సినిమాకు ఆ వసూళ్లే చాలా చాలా ఎక్కువ. కానీ మరుసటి ఏడాది అంటే 2018లో ఇదే సినిమాను చైనాలో రిలీజ్ చేశారు. అక్కడి నుంచి సీక్రెట్ సూపర్ స్టార్ దశ తిరిగిపోయింది. ఆ దేశంలో ఏకంగా 10 కోట్ల డాలర్లకుపైనే వసూలు చేసింది. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.905 కోట్ల వసూళ్లు సాధించింది.
ఆ సమయానికి దంగల్, బాహుబలి 2 మాత్రమే ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. ఆ లెక్కన ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెసైందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
టాపిక్