Indian Idol 14 Winner: ఇండియన్ ఐడల్ 14 విజేత అతడే.. ఈ సింగింగ్ రియాల్టీ షో ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
Indian Idol 14 Winner: పాపులర్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ 14వ సీజన్ విజేతగా వైభవ్ గుప్తా నిలిచాడు. ఆదివారం (మార్చి 3) జరిగిన గ్రాండ్ ఫినాలేలో మరో ఐదుగురు ఫైనలిస్టులను వెనక్కి నెట్టి అతడు ట్రోఫీ అందుకున్నాడు.
Indian Idol 14 Winner: ఇండియన్ ఐడల్.. ఇది దేశంలోనే అత్యుత్తమ సింగింగ్ రియాల్టీ షోలలో ఒకటి. తాజాగా హిందీ వెర్షన్ 14వ సీజన్ పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లో కాన్పూర్ కు చెందిన వైభవ్ గుప్తా టైటిల్ గెలిచాడు. మొత్తం 15 మందితో ప్రారంభమైన ఈ సీజన్ లో ఆరుగురు ఫైనలిస్టులుగా నిలిచారు. ఆదివారం (మార్చి 3) జరిగిన గ్రాండ్ ఫినాలేలో మిగిలిన ఐదుగురిని వెనక్కి నెట్టి వైభవ్ విజయం సాధించాడు.
ఇండియన్ ఐడల్ వైభవ్ గుప్తా
ఇండియన్ ఐడల్ 14వ సీజన్ లో వైభవ్ గుప్తాతోపాటు శుభదీప్ దాస్, పియూష్ పవార్, అనన్య పాల్, అంజనా పద్మనాభన్, ఆద్య మిశ్రా ఫైనల్ చేరుకున్నారు. వీళ్ల మధ్య ఫైనల్ కూడా హోరాహోరీగా సాగింది. అయితే చివరికి జడ్జీలు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు వేసిన ఓట్లను ఆధారంగా తీసుకొని వైభవ్ గుప్తాను విజేతగా అనౌన్స్ చేశారు.
ఈ 14వ సీజన్ కు ప్రముఖ సింగర్ కుమార్ సాను, శ్రేయా ఘోషాల్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ జడ్జీలుగా వ్యవహరించారు. 1990ల్లో ఇండియన్ మ్యూజిక్ ను ఓ ఊపు ఊపేసిన కుమార్ సాను తొలిసారి ఈ షోకు జడ్జీగా ఉన్నాడు. హుస్సేన్ ఈ షోను హోస్ట్ చేశాడు. నిజానికి గత 9 సీజన్లుగా ఈ షోకు దూరంగా ఉన్న అతడు.. రెగ్యులర్ హోస్ట్ ఆదిత్య నారాయణ్ ను కాదని ఈసారి హోస్ట్ గా వచ్చాడు.
ఇండియన్ ఐడల్ 14 ప్రైజ్‌మనీ
ఇండియన్ ఐడల్ 14 విజేతగా నిలిచిన వైభవ్ గుప్తాకు ఏకంగా రూ.25 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఈ డబ్బుతో తాను ఏం చేస్తానన్నది కూడా అతడు షో తర్వాత వివరించాడు. పింక్‌విల్లాతో అతడు మాట్లాడాడు. "ఈ షో ద్వారా నేను గెలిచిన ప్రైజ్ మనీతో సొంతంగా ఓ స్టూడియో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అక్కడ నేను పాడే పాటలను రికార్డు చేస్తాను. నా అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్లకు మరింత వినోదాన్ని పంచుతాను. స్టూడియో పెట్టుకోవాలన్నది ఎప్పటి నుంచో నా కలగా ఉంది" అని వైభవ్ అన్నాడు.
ఇండియన్ ఐడల్ 14వ సీజన్ గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఐదు నెలలు, 43 ఎపిసోడ్లపాటు సోనీ టీవీ ఈ మెగా షోని టెలికాస్ట్ చేసింది. ఇప్పటికీ ఈ షో అన్ని ఎపిసోడ్లు సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఈసారి ఇండియన్ ఐడల్ చాలా ఇంట్రెస్టింగా సాగింది. ఫైనలిస్టులు ఆరు మందిలో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
ఫైనల్ చేరిన ఆరుగురూ ఈ సీజన్ మొత్తం అద్భుతంగా పాడారు. పియూష్, శుభదీప్, అనన్యలలో ఒకరు విజేతగా నిలిచే అవకాశం ఉంటుందని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా కాన్పూర్ కు చెందిన వైభవ్ గుప్తా టైటిల్ ఎగరేసుకుపోయాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తన పెద్దమ్మ పెంపకంలో పెరిగిన వైభవ్.. ఇప్పుడో సింగింగ్ సెన్సేషన్ అయ్యాడు.