Indian 2 Trailer: ఓ వ్యక్తి 106 ఏళ్ల వయసు వరకు జీవించి ఉండటమే కష్టం. ఒకవేళ ఉన్నా అడుగు తీసి అడుగు వేయడం గగనం. అలాంటిది ఇండియన్ 2 మూవీలో 106 ఏళ్ల వయసున్న సేనాపతి అలా ఎలా గాల్లోకి లేస్తూ స్టంట్స్ చేశాడు? ఇదే విషయాన్ని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అడిగితే.. డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు.
మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) వచ్చేస్తోంది. తాజాగా మంగళవారం (జూన్ 25) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఊహించినట్లే శంకర్ రేంజ్ లో చాలా గ్రాండ్ గా ఉంది. అయితే భారతీయుడు నుంచి భారతీయుడు 2కి వచ్చేనాటికి ఇందులో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర వయసు మరో 28 ఏళ్లు పెరిగింది.
మరి భారతీయుడు ప్రకారం 1918లో జన్మించిన సేనాపతి వయసు ఇప్పుడు 106 ఏళ్లు. ఆ వయసులో ట్రైలర్ లో చూపించినట్లు అతడు స్టంట్స్ ఎలా చేయగలిగాడు? ఇదే సందేహం చాలా మందికి కలిగింది. దీనిపై ఓ జర్నలిస్టు ప్రశ్న కూడా అడిగాడు. మొదట దీనికి కమల్ హాసన్ సమాధానం ఇచ్చాడు.
"వయసు అనేది డైరెక్టర్ నిర్ధారిస్తారు. నేను 120 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా నటించాలనే అనిపిస్తుంది" అని కమల్ అన్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ స్పందిస్తూ.. "చైనాలో ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఉన్నాడు. అతని పేరు లూసీ గియోన్. 120 ఏళ్ల వయసులో అతడు మార్షల్ ఆర్ట్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. అతడు ఎగురుతున్నాడు, తంతున్నాడు.
అన్నీ చేస్తున్నాడు. సేనాపతి పాత్ర కూడా ఓ మాస్టరే. పురాతన మర్మకళలో ఆరితేరిన వ్యక్తి. సేనాపతికి తన ఆహార అలవాట్లలో క్రమశిక్షణ ఉంది. యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాడు. రోజుకు ఒక్కసారే తింటాడు. అందువల్ల మీ కళలో మాస్టర్ అయి, క్రమశిక్షణ ఉంటే వయసుతో సంబంధం ఏంటి. ఎలాంటి స్టంట్ అయినా చేయగలరు" అని చెప్పడం విశేషం.
డైరెక్టర్ శంకర్ కు సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో మంచి పట్టు ఉంది. 1990ల్లో అతడు ఇలా తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. భారతీయుడు కూడా అలా వచ్చి రికార్డులు బ్రేక్ చేసిన మూవీయే. అయితే రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చి శంకర్ ఇండియన్ 2 తీశాడు. ఇప్పుడిది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందన్నది సందేహమే.
ట్రైలర్ చూస్తుంటేనే ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ కాన్సెప్టే అనిపిస్తోంది. కానీ శంకర్ దానిని తెరపై ఎలా ప్రెజెంట్ చేశాడు? భారతీయుడులో సేనాపతిగా అదరగొట్టిన కమల్ హాసన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయగలాడా అన్నదానిపై మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. ఇండియన్ 2 మూవీ జులై 12న రిలీజ్ కాబోతోంది.