Indian 2 Runtime: ఇండియన్ 2 రన్‌టైమ్ ఇదే.. చాలా ఎక్కువే.. మరో పెద్ద సినిమా లోడింగ్..
Indian 2 Runtime: ఇండియన్ 2 మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్ టైమ్ కూడా రివీలైంది. కల్కి 2898 ఏడీ తర్వాత అంతటి రన్ టైమ్ తో వస్తున్న సినిమా ఇదే.
Indian 2 Runtime: ఇండియన్ 2.. తెలుగులో భారతీయుడు 2గా వస్తున్న మూవీ ఇది. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అప్పుడే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో మేకర్స్ కూడా ప్రమోషన్ల జోరు పెంచారు. అయితే ఇప్పటికైతే పెద్ద బజ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు.
ఇండియన్ 2 రన్ టైమ్
ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 వస్తోంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువగానే ఉంది. ఏకంగా మూడు గంటల ఐదు నిమిషాల పాటు ఉండటం విశేషం. ఈ మధ్యే రిలీజైన కల్కి 2898 ఏడీ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటల 56 సెకన్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఈ ఇండియన్ 2 కూడా మూడు గంటల సినిమాగా రానుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. 1996లో వచ్చిన ఇండియన్ మూవీ రన్ టైమ్ కూడా దాదాపు ఇంతే ఉంది. అయితే అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనంగా నిలిచింది. కమల్ నట విశ్వరూపం, శంకర్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ సీక్వెల్ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియన్ 2 ట్రైలర్‌పై ట్రోలింగ్
నిజానికి ఇండియన్ 2 మూవీ ట్రైలర్ వచ్చినప్పుడే చాలా మంది పెదవి విరిచారు. ఓ ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ తో వస్తున్నారని, డైరెక్టర్ శంకర్ పనైపోయిందని కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ సేనాపతిగా తిరిగి వస్తుండగా.. ఈ సీక్వెల్లో సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ లాంటి వాళ్లు కూడా నటించారు.
ట్రైలర్ లో 106 ఏళ్ల వయసున్న సేనాపతి అవలీలగా స్టంట్స్ చేయడంపై కూడా ట్రోలింగ్ జరిగింది. దీనికి డైరెక్టర్ శంకర్ వివరణ కూడా ఇచ్చాడు. చైనాలో 120 ఏళ్ల వయసున్న ఓ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ ఇప్పటికీ ఎన్నో స్టంట్స్ చేస్తున్నాడని, సేనాపతి కూడా అలాంటి ఆహార అలవాట్లు, క్రమశిక్షణ ఉన్న పాత్ర అని అతడు చెప్పడం విశేషం.
ఇండియన్ మూవీలో కమల్ హాసన్ డ్యుయల్ రోల్ పోషించాడు. స్వాతంత్య్ర సమరయోధుడైన సేనాపతి పాత్రతోపాటు అతని కొడుకు పాత్రలోనూ కమల్ కనిపించాడు. అవినీతి, లంచగొండితనాన్ని రూపుమాపే క్రమంలో తన కొడుకును కూడా సేనాపతి హత్య చేయడంతో తొలి భాగం ముగిసింది. క్లైమ్యాక్స్ లో ప్రమాదం నుంచి బయటపడి దేశం వదిలి వెళ్లిపోయిన ఆ భారతీయుడు.. ఇప్పుడీ సీక్వెల్ తో మళ్లీ రానున్నాడు.
టాపిక్