Indian 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్.. సేనాపతి మళ్లీ వచ్చేశాడు.. అదిరిపోయిన ఇండియన్ 2 ఇంట్రో
Indian 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ సేనాపతి మళ్లీ వచ్చేశాడు. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 మూవీ ఇంట్రోను శుక్రవారం (నవంబర్ 3) రిలీజ్ చేశాడు.
Indian 2 Intro: లోక నాయకుడు కమల్ హాసన్ 27 ఏళ్ల కిందట నటించిన భారతీయుడు సినిమా గుర్తుందా? శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు భారతీయుడు 2 రూపంలో సీక్వెల్ వస్తోంది. ఈ మూవీ ఇంట్రో వీడియోను మేకర్స్ శుక్రవారం (నవంబర్ 3) రిలీజ్ చేశారు. భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ సేనాపతి మళ్లీ వచ్చేశాడు.
భారతీయుడు సినిమాను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ను మొదలు పెట్టినట్లు ఇండియన్ 2 ఇంట్రో వీడియోలో చూపించారు. దేశం వదిలి వెళ్లి ఎక్కడో విదేశం నుంచి ఇండియాకు కాల్ చేసి.. "ఏ తప్పు జరిగినా మళ్లీ వస్తాను.. ఈ భారతీయుడికి చావే లేదు" అంటూ సేనాపతి మాట్లాడిన మాటలతో భారతీయుడు సినిమా ముగుస్తుంది.
సరిగ్గా అక్కడి నుంచే ఈ భారతీయుడు 2 ఇంట్రో మొదలైంది. ఆ తర్వాత ప్రతి పనికీ లంచాలు తీసుకునే అధికారులను చూపించారు. కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ బ్యాక్‌గ్రౌండ్ లో సాంగ్ మొదలవుతుంది. ఈ మనషులు ఎవరూ మారలేదు.. నువ్వు మరోసారి రావాల్సిందే అంటూ ఈ పాట సాగిపోతుంది. చివర్లో కమల్ హాసన్ మరోసారి సేనాపతి రూపంలో ఎంట్రీ ఇస్తాడు.
నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ వస్తాడు. అక్కడితో ఈ ఇండియన్ 2 ఇంట్రో ముగుస్తుంది. ఈ ఇంట్రోని ఒక్కో భాషలో ఒక్కో ప్రముఖుడు రిలీజ్ చేశారు. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఇండియన్ 2 ఇంట్రోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక తమిళంలో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో ఆమిర్ ఖాన్ ఇంట్రో రిలీజ్ చేయడం విశేషం.
దేశంలో అవినీతిని అంతమొందించే స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. అవినీతి కూపంలో కూరుకుపోయిన తన సొంత కొడుకునే చంపేసి విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు.. తిరిగి ఇండియాకు రావడాన్ని సీక్వెల్ లో చూపించినట్లు ఇంట్రో చూస్తే తెలుస్తోంది.
ఈ సినిమా 1996లో భారతీయుడికి సీక్వెల్. 2019లోనే షూటింగ్ మొదలైంది. అయితే 2020లో కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా వచ్చాయి. చివరికి 2022లో మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. మొత్తానికి వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంట్రోలో కమల్ హాసన్ తోపాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ఎస్‌జే సూర్యలాంటి వాళ్లు కూడా కనిపించారు.