India vs Pakistan: భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఒక్కో టికెట్ రూ.4లక్షలు!
India vs Pakistan - Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ టికెట్ ధరలు బ్లాక్ మార్కెట్ సైట్లలో ఆకాశాన్ని అంటుతున్నాయి.

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంటుంది. ఈ హైవోల్టేజ్ సమరం కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈనెల ఫిబ్రవరి 23వ తేదీన భారత్, పాక్ తలపడనున్నాయి. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరనుంది. ఈ మ్యాచ్‍పై హైప్ విపరీతంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల ధరలు.. బ్లాక్‍మార్కెట్లో చుక్కలను చేరాయి.
ఒక్కో టికెట్ రూ.4లక్షలు
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు దుబాయి బ్లాక్ మార్కెట్ వెబ్‍సైట్లలో లిస్ట్ అయ్యాయి. ఈ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో బ్లాక్ మార్కెటర్స్ భారీగా ధరలు పెట్టేశారు. అఫీషియల్‍గా టికెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్ రూపంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దుబాయ్ స్టేడియంలో జరిగే భారత్, పాక్ మ్యాచ్ కోసం గ్రాడ్ లాంజ్ టికెట్లు సుమారు ఒక్కోటి రూ.4లక్షలకు బ్లాక్ మార్కెట్ సైట్లలో కనిపిస్తున్నాయి. ఇదే స్టాండ్‍లో కొన్ని బెస్ట్ సీట్లకు ధర మరింత ఎక్కువగా ఉంది. సాధారణ స్టాండ్ల ధరలు కూడా అఫీషియల్ రేట్లతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బ్లాక్‍లో టికెట్లు కొనాలను ప్రయత్నించిన వారు అవాక్కవుతున్నారు.
అనుమతులను పొందితే దుబాయ్‍లో టికెట్లను రీసేల్ చేయడం లీగలే. అందుకే ఫుల్ హైప్ ఉన్న స్పోర్ట్స్ మ్యాచ్‍ల టికెట్లను కొందరు ఇలా బ్లాక్ మార్కెట్లు అధిక ధరలను అమ్ముతుంటారు. ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍ను కూడా క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెటర్స్ రంగంలోకి దిగారు.
ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీంతో తమ అన్ని మ్యాచ్‍లను దుబాయ్‍లో భారత్ ఆడనుంది. మిగిలిన మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో జరుగుతాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూప్‍లుగా టోర్నీ తలపడున్నాయి.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీలో పోరును టీమిండియా మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‍తో తలపడనుంది. మార్చి 2న న్యూజిలాండ్‍తో ఆడనుంది. గ్రూప్ దశ తర్వాత సెమీస్, ఫైనల్ చేరినా దుబాయ్‍లోనే ఆడనుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్. ఇప్పటికే దుబాయి చేరిన భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
లాహోర్‌లో భారత పతాకం లేకుండానే..
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్‍లోని లాహోర్ స్టేడియంలో జాతీయ పతాకాల ఆవిష్కణ జరిగింది. అయితే, ఏడు దేశాల జెండాలనే స్డేడియం వద్ద ఉంచింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. టోర్నీ ఆడేందుకు పాక్‍కు వచ్చేందుకు భారత్ అంగీకరించలేదు. అందుకే భారత జెండాను లాహోర్ గడాఫీ స్టేడియంలో పీసీబీ ఉంచలేదని తెలుస్తోంది.
సంబంధిత కథనం