Telugu News  /  Sports  /  India Looked To Eye On Series Against South Africa In Third Odi
భారత్-దక్షిణాఫ్రికా
భారత్-దక్షిణాఫ్రికా (Twitter)

India vs South Africa Preview: సిరీస్‌పై కన్నేసిన భారత్-దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డే నేడే

11 October 2022, 11:04 ISTMaragani Govardhan
11 October 2022, 11:04 IST

India vs South Africa: దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికంగా మంగళవారం నాడు దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30కి ప్రారంభం కానుంది. ఇందులో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు చూస్తున్నాయి.

India vs South Africa 3rd ODI Preview: టీ20 ప్రపంచకప్ ముందు భారత్.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వన్డేలు జరగ్గా.. నేడు మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు. దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు చెరోకటి గెలిచి 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. మంగళవారం నాడు నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో యువ భారత్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. రెండో దాంట్లో ఓడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

గత మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమైనప్పటికీ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో విజృంభించగా.. ఇషాన్ కిషన్ అద్బుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లతో పాటు బౌలర్లూ సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరిచూపులు మహమ్మద్ సిరాజ్‌పైనే ఉన్నాయి. దీపక్ చాహర్ గాయంతో దూరమైన వేళ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది సభ్యుల్లో సిరాజ్ కూడా ఉన్నాయి. అతడు ఈ మ్యాచ్‌లో సత్తా చాటితే తుదిజట్టులో తీసుకునే అవకాశముంటుంది.

మరోపక్క బ్యాటింగ్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ విఫలం కావడం అభిమానులను నిరాశ పరుస్తోంది. అతడు బ్యాట్ ఝుళిపించాల్సిన ఆవశ్యకత ఉంది. మరోపక్క వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌ నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికే శాంసన్, శ్రేయాస్, శుభ్‌మన్ గిల్ ఆ పనిలో ఉన్నారు. నిలకడగా రాణిస్తున్నా శాంసన్‌కు అవకాశం కల్పించకపోవడంతో అభిమానులు పదే పదే నిరుత్సాహం చెందుతున్నారు. దీంతో అతడు ఈ సిరీస్‌లో కసిగా ఆడుతూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు.

మరోపక్క దక్షిణాఫ్రికా 2023 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడానికి సిరీస్‌ను విజయంతో ముగించి సూపర్ లీగ్ పాయింట్లను సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 59 పాయింట్లతో దక్షిణాఫ్రికా 11వ స్థానంలో ఉంది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ టెంబా బవుమా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు అతడు తిరిగి వచ్చే అవకాశముంది. పర్యాటక జట్టుకు కూడా సిరీస్‌పై సమానావకాశాలు ఉన్నందున ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

తుది జట్లు..

భారత్..

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా..

క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, కగిసో రబాడా.