India Biggest Overseas Hit: విదేశంలో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన 1971 నాటి సినిమా.. RRR, సలార్, పఠాన్ కూాడా సాటిరావు!
India Biggest Overseas Hit Caravan: చైనాలో ఏకంగా 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయి ఇండియాలోనే అతిపెద్ద ఓవర్సీస్ హిట్ సినిమాగా నిలిచింది కారవాన్ మూవీ. 1971లో ఇంతపెద్ద ఫీట్ సాధించిన ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్, సలార్, దంగల్ వంటి బ్లాక్ బస్టర్స్ దరిదాపుల్లోకి రాలేదు.
India Biggest Overseas Hit Caravan: ఇటీవల కాలంలో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. వాటిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జైరా వాసిం నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ నుంచి ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్, రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ సలార్ వరకు ఎన్నో ఉన్నాయి.
ఈ సినిమాలన్నీ అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాయి. కానీ, వీటన్నిటకింటే మించి అతిపెద్ద ఫీట్ సాధించిన సినిమా ఒకటి ఉంది. 1971లో వచ్చిన ఈ సినిమా అపూర్వమైన రికార్డును అందుకుంది. ఈ సినిమాకు ఇటీవలి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన RRR, పఠాన్, దంగల్, త్రీ ఇడియట్స్, సలార్ వంటి చిత్రాలు కూడా రికార్డ్ దగ్గరిగా లేకపోవడం విశేషం.
ఆ సినిమా పేరే కారవాన్. హిందీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించారు. ఈ 1971 క్రైమ్ థ్రిల్లర్ కారవాన్‌లో అలనాటి సూపర్ స్టార్ జీతేంద్ర, ఆశా పరేఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణా ఇరానీ, మెహమూద్ జూనియర్, హెలెన్, రవీంద్ర కపూర్, మదన్ పూరి, మనోరమ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ చిత్రం భారతదేశంలో రూ. 3.6 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. 1979లో కారవాన్ సినిమా చైనాలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం చైనాలో 30 కోట్లకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఆ సమయంలో రూ. 30 కోట్లకు పైగా వసూళ్లతో ఓవర్సీస్‌లో భారతదేశపు అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
కారవాన్ విజయానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు RD బర్మన్ అండ్ గీత రచయిత మజ్రో సుల్తాన్‌పురి స్వరపరిచిన సౌండ్‌ట్రాక్. చడ్తీ జవానీ మేరీ చాల్ మస్తానీ, దిల్బర్ దిల్ సే ప్యారే, పియా తు అబ్ తో ఆజా, కిత్నా ప్యారా వాదా హై వంటి పాటలు విడుదలైన తర్వాత వెంటనే క్లాసిక్ హిట్‌గా మారాయి.
నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన ఈ కారవాన్ చిత్రాన్ని అతని సోదరుడు తాహిర్ హుస్సేన్ నిర్మించారు. ఈ సినిమా తర్వాత తాహిర్ హుస్సేన్ కుమారుడు ఆమీర్ ఖాన్ సినిమాలు వారసత్వాన్ని కొనసాగించాయి. చైనాలో ఆమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్ సినిమాలు రికార్డులు సృష్టించి ఓవర్సీస్‌లో అతిపెద్ద ఇండియన్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.
కారవాన్ సినిమాతో ఓవర్సీస్ హిట్‌ను నెలకొల్పిన తాహిర్ వారసత్వాన్ని ఆమీర్ ఖాన్ తన చిత్రాలతో ఇలా కొనసాగించాడని చెబుతారు. కాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా ఆమీర్ ఖాన్ పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఖాన్ త్రయంలో ఒక స్టార్ హీరోగా ఇప్పటికీ వెలుగొందుతున్నాడు.
ఇక ఆమీర్ ఖాన్ చివరిగా లాల్ సింగ్ చద్ధా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ మూవీ ఆశించినంత స్థాయిలో హిట్ అందుకోలేదు. కానీ, ఇటీవల ఆమీర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు నిర్మాతగా వ్యవహరించిన లపాట లేడీస్ సినిమా భారీ స్పందనను తెచ్చుకుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.