Bigg Boss Telugu 6 Episode 99: ఇంటి నుంచి ఇనాయా ఔట్.. చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్-inaya sultana eliminated from the bigg boss house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 99: ఇంటి నుంచి ఇనాయా ఔట్.. చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్

Bigg Boss Telugu 6 Episode 99: ఇంటి నుంచి ఇనాయా ఔట్.. చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్

Maragani Govardhan HT Telugu
Dec 12, 2022 07:42 AM IST

Bigg Boss Telugu 6 Episode 99: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇనాయ ఎలిమినేట్ అయింది. అందరూ ఊహించినట్లుగానే ఇనాయానే ఎలిమినేట్ చేస్తూ బిగ్‌బాస్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అంతేకాకుండా చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.

ఇనాయ ఎలిమినేట్
ఇనాయ ఎలిమినేట్

Bigg Boss Telugu 6 Episode 99: బిగ్‌బాస్ సీజన్ 6లో ఊహించని కొన్ని మలుపులు జరుగుతున్నాయి. టాప్-5 ఫైనలిస్టుగా ఇనాయ కన్ఫార్మ్‌గా ఉంటుందని భావించిన అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమెను ఎలిమినేట్ చేసింది బిగ్‌బాస్ యాజమాన్యం. అనధికార పోల్స్‌లో ఎక్కడ చూసిన టాప్-3లో ఉన్న ఇనాయా సుల్తానా ఎలిమినేట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అధికారిక పోల్స్‌లో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఎలిమినేట్ చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. విన్నర్ తానే అంటూ సవాల్ చేసి ఇనాయ.. ఒక్క అడుగు దూరంలో బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రయాణాన్ని ముగించింది. వెళ్లేటప్పుడు తన జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఎప్పటి మాదిరిగానే బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ఫండేగానే సాగింది. ఇంటి సభ్యులతో హోస్ట్ నాగ్ ఆడించిన టాస్కులు, ఆటలు, పాటలతో సరదాగా గడిచిపోయింది. ఇందులో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి నీకెంత తెలుసు అనే టాస్క్ ఇచ్చారు నాగ్. హౌస్‌లో ఉండే వస్తువులు, పరిసరాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు ఇందులో ఎక్కువ ప్రశ్నలకు సమాధానమిచ్చిన రేవంత్ గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత హౌస్ మేట్స్‌తో పాటలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ఆదిరెడ్డిపై నాగార్జున వేసే జోకులు బాగా పేలాయి. ఇందుకు ఆదిరెడ్డి కూడా తనదైన శైలిలో వినోదాన్ని పండించాడు. ఈ క్రమంలో నామినేషన్‌లో ఉన్న హౌస్ మేట్స్‌ను ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరకు ఆదిరెడ్డి, ఇనాయ మాత్రమే మిగిలారు. ప్రేక్షకులు సహా కంటెస్టెంట్లు ఊపిరి బిగబట్టి కూర్చున్న సమయంలో బోర్డుపై లిక్విడ్‌తో తుడవడంతో ఇనాయ పేరు వచ్చింది.

ఇనాయా ఎలిమినేషన్..

దీంతో ఇనాయా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఎలాగైన టైటిల్ గెలవాలని పట్టుదల పెట్టుకున్న ఆ స్వప్నం నెరవేరకుండానే హౌస్ వీడినందుకు ఆమె భావోద్వేగానికి లోనైంది. అంతేకాకుండా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయానని ఫీలైంది. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత నాగార్జున.. ఇంట్లో ఉన్న టాప్-6 కంటెస్టెంట్ల గురించి మంచి, చెడు లక్షణాలను చెప్పమన్నారు. ఇందుకు ఇనాయ ఒక్కొక్కరి గురించి వివరిస్తూ వెళ్లింది.

శ్రీహాన్ కప్పు కొట్టాలి..

ముందుగా శ్రీహాన్‌తో ప్రారంభిస్తానని చెప్పి.. అతడు ఎంతో మంచి వాడని, ఆ విషయం తనకు తర్వాత అర్థమైందని తెలిపింది. శ్రీహాన్ టైటిల్ కొట్టుకుని రావాలని స్పష్టం చేసింది. చెడు లక్షణాల గురించి చెబుతూ అవతలి వాళ్లను అర్థం చేసుకుంటే బాగుండు, వెనక మాట్లాడటం తగ్గించుకోవాలని సూచించింది. ఆదిరెడ్డి గురించి మాట్లాడుతూ.. అతడు నిజాయితీపరుడని, ఆటలోనూ అలాగే ఉంటాడని తెలిపింది. శ్రీసత్య తనకు నచ్చినవాళ్ల కోసం ఏదైనా చేస్తుందని, నచ్చని వాళ్లను విపరీతంగా రెచ్చగొడుతుందని ఇనాయ స్పష్టం చేసింది. కీర్తి ఎలాంటి బాధ నుంచైనా బయటపడుతుందని, కానీ అందుకు సమయం పడుతుందని తెలిపింది.

మిడ్ వీక్ ఎలిమినేషన్..

రోహిత్ డీసెంట్ గుడ్ బాయ్ అని, అలాగే తనలో సామర్థ్యాన్ని అతుడ ఇంకా పూర్తిగా బయటపెట్టలేదని తెలిపింది. రేవంత్ గురించి మాట్లాడుతూ.. అందరితో బాగుంటాడని, అందరికీ ఫుడ్ షేర్ చేస్తాడని చెప్పింది. ఇదే సమయంలో అందరికీ మంచి చెప్పాలని అనుకుంటాడని, అది అవతలి వాళ్లకు నచ్చదని చెప్పొకొచ్చింది. అనంతరం నాగార్జున గౌరవంగా ఆమెను బయటకు పంపించారు. అనంతరం నాగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. బుధవారం ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపించేస్తామని తెలిపారు. దీంతో హౌస్ మేట్స్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.

WhatsApp channel

సంబంధిత కథనం