Ilayaraja Daughter Passed Away: ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం.. కూతురి అకాల మరణం
Ilayaraja Daughter Passed Away: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు భవతరణి గురువారం (జనవరి 25) సాయంత్రం కన్నుమూసింది. చాన్నాళ్లుగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతోంది.
Ilayaraja Daughter Passed Away: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత జ్ఞానిగా పేరుగాంచిన ఇళయరాజా కూతురు భవతరణి కన్నుమూసింది. చాలా రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతోంది.

అక్కడే గురువారం (జనవరి 25) సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంతో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భవతరణి అకాల మరణం కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.
తండ్రి, సోదరుల బాటలోనే..
ఇళయరాజా కూతురు భవతరణి వయసు కేవలం 47 ఏళ్లు. ఆమె తండ్రిలాగే మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఇళయరాజా తనయులైన యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజాలకు సోదరి. తన తండ్రి, సోదరులు మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాల్లోనే భవదరణి ఎక్కువగా పాటలు పాడింది. ఇళయరాజా కంపోజ్ చేసిన భారతి మూవీలోని మైల్పోలా పొన్ను ఒన్ను పాటకుగాను బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
భిన్నమైన గాత్రంతో భవతరణి తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్లేబ్యాక్ సింగర్ గా రాసయ్య మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె పాడిన పాట పెద్ద హిట్ కావడంతో ఆ తర్వాత నుంచి తన తండ్రి, సోదరుల మ్యూజిక్ కంపోజిషన్ లో రెగ్యులర్ గా పాటలు పాడటం మొదలు పెట్టింది. నిజానికి ప్రముఖ నటి రేవతి డైరెక్ట్ చేసిన మిత్ర్ మై ఫ్రెండ్ మూవీతో భవధరణి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చింది.
తెలుగులోనూ పాడిన భవతరణి
తెలుగులోనూ 2003లో వచ్చిన అవునా సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఇక 2012లో వచ్చిన గుండెల్లో గోదారి మూవీలో పాట పాడింది. రేవతి డైరెక్షన్ లోనే వచ్చిన హిందీ మూవీ ఫిర్ మిలేంగేకు కూడా భవతరణి మ్యూజిక్ అందించింది. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పా శెట్టిలాంటి నటీనటులు ఇందులో నటించారు. వెల్లిచ్చి అనే గ్రామీణ సంగీతంతో ఆమె బాగా పేరు సంపాదించింది. శబరిరాజ్ అనే ఓ అడ్వర్టైజ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ను భవతరణి పెళ్లి చేసుకుంది.
తన ప్రత్యేకమైన గాత్రంతో తమిళంలో భవతరణి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 1995లో తన మ్యూజిక్ కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పుడామె అకాల మరణం సౌత్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది.