Vijay Deverakonda: ఆయనకు కూడా నేషనల్ అవార్డు రావాల్సింది: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda: ఖుషి ప్రమోషన్లలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు హీరో విజయ్ దేవరకొండ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది.
Vijay Deverakonda: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ అదరగొట్టింది. 2021కు గాను తెలుగు చిత్రాలకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు దక్కాయి. పుష్ప 1: ది రైజ్ చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్‍కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన యాక్టర్‌గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో లైవ్ ద్వారా ఆన్సర్స్ ఇచ్చారు. పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఖుషిని ప్రొడ్యూజ్ చేసింది. నిర్మాత రవిశంకర్ కూడా విజయ్ దేవరకొండ ఆన్సర్స్ చెప్పే కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డుల ప్రస్తావన వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
తాము నిర్మించిన పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్‍కు అవార్డు రావడం, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (తెలుగు) ఉప్పెనకు నేషనల్ అవార్డు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ అన్నారు. కమర్షియల్‍గా సక్సెస్ అవటంతో పాటు అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కల్పించుకున్నారు. పుష్ప 1: ది రైజ్ చిత్రానికి గాను దర్శకుడు సుకుమార్‌కు కూడా జాతీయ అవార్డు రావాల్సిందని విజయ్ అన్నారు. “సుక్కు (సుకుమార్)కు కూడా రావాల్సింది నా ప్రకారం” అని విజయ్ అన్నారు.
సుకుమార్ అందుకు చాలా అర్హత కలిగిన వ్యక్తి అని, అయితే చాలా అంశాలు ఉంటాయి కాబట్టి మిస్ అయి ఉండొచ్చని రవిశంకర్ చెప్పారు. పుష్ప 2 చిత్రానికి సుకుమార్‌కు జాతీయ అవార్డు వస్తుందని బలంగా నమ్ముతున్నామని రవిశంకర్ చెప్పారు. పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని ఓ రేంజ్‍లో తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాతో సుకుమార్ నేషనల్ అవార్డు లోటు తీరుతుందని చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని నిర్మాత రవిశంకర్ చెప్పారు.
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రేపు (సెప్టెంబర్ 1) థియేటర్లలో రిలీజ్ కానుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషి విడుదల కానుంది.
కాగా, 2021లో పుష్ప 1: ది రైజ్ సినిమా నేషనల్ రేంజ్‍లో బ్లాక్‍బాస్టర్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీనికి సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ మరింత గ్రాండ్‍గా భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టాపిక్