Salman Khan: నేను బాక్సాఫీస్ నంబర్లను పట్టించుకోను: సల్మాన్ ఖాన్
Salman Khan: తాను బాక్సాఫీస్ కలెక్షన్ల నంబర్లను పట్టించుకోనని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెప్పారు. అలాగే తాను గాసిప్స్, రూమర్లను ఎక్కువగా ఫాలో కానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Salman Khan: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దిశగా దూసుకెళుతోంది. నవంబర్ 12న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. స్పైయాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన టైగర్ 3కి పాజిటివ్ టాక్ రావటంతో సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా టైగర్ 3 చిత్రానికి ఇప్పటి వరకు 14 రోజుల్లో సుమారు రూ.425కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే, బాక్సాఫీస్ నంబర్ల విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడారు.
తన చిత్రాలతో పాటు ఎవరి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలను కూడా తాను పెద్దగా తెలుసుకోనని, పట్టించుకోనని సల్మాన్ ఖాన్ అన్నారు. బాక్సాఫీస్ నంబర్లను తాను ఫాలో కానని స్పష్టం చేశారు. “నేను బయటికి వెళ్లడం, గాసిప్స్ గురించి మాట్లాడడం, ఇతరుల గురించి ముచ్చట్లు పెట్టడం లాంటివి చేయను. వాళ్లు ఏం చేస్తున్నారు.. ఏం జరుగుతోంది.. వాళ్ల నంబర్స్ (బాక్సాఫీస్) ఎలా ఉన్నాయి.. వీళ్ల నంబర్స్ ఎలా ఉన్నాయి అనే వాటిని ఫాలో కాను” అని సల్మాన్ చెప్పారు.
“ఆ విషయాలను నేను పెద్దగా పట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో దానిపై ఏకాగ్రతగా ఉంటా. నా ఇంటికి వచ్చే వారు కూడా నాతో పని చేస్తున్న వారో.. ఇంతకు ముందు వర్క్ చేసిన వారో ఎక్కువగా ఉంటారు. నాకు నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు” అని సల్మాన్ చెప్పారు. తాను పార్టీలకు వెళ్లనని, షూటింగ్ అయిపోయాక మళ్లీ ఇంటికి వచ్చేయడమే తనకు ఇష్టమని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.
బాలీవుడ్‍లో ప్రస్తుతం బాక్సాఫీస్ నంబర్లపై చర్చ సాగుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది రూ.1000కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో సల్మాన్ ఖాన్.. టైగర్ 3 కూడా ఆ రేంజ్‍లో వసూళ్లను రాబడుతుందని అభిమానులు అంచనాలు వేశారు. అయితే, టైగర్ 3కి రూ.100కోట్ల మార్క్ కష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో తాను అసలు ఎవరి బాక్సాఫీస్ నంబర్లను పట్టించుకోనని సల్మాన్ కుండబద్దలు కొట్టేశారు.
యశ్‍రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగానే టైగర్ 3 రూపొందింది. మనీశ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‍గా నటించారు. ఇమ్రాన్ హష్మి, రేవతి, సిమ్రన్, రిద్ధి డోగ్రా కీలకపాత్రలు చేశారు. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియో రోల్స్‌లో కనిపించారు.