Pawan Kalyan: ‘మరిచిపోను’: అల్లు అర్జున్‍పై పవన్ కల్యాణ్ ఇన్‍డైరెక్ట్ కామెంట్ చేశాారా! ‘ఎవరిపై ద్వేషం ఉండదు’
Pawan Kalyan - Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో మూలాలు అంటూ మాట్లాడారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో జరిగింది. రాజమండ్రి వేదికగా జరిగిన ఈ ఈవెంట్‍కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పాల్గొన్న తొలి సినీ ఈవెంట్ ఇదే. ఈ మెగా పవర్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చాలా విషయాలపై మాట్లాడారు. సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో తాను మూలాలను మరిచిపోనంటూ కామెంట్లు చేశారు.
మీరు ఏమన్నా ఆద్యుడు ఆయనే..
తనతో పాటు మెగా హీరోలందరికీ మూలం తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే అని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ఎప్పటికీ మూలాలను మరిచిపోనని స్పష్టం చేశారు. “మీరు కల్యాణ్ బాబు అనండి. ఓజీ అనండి. డిప్యూటీ సీఎం అనండి. ఏదన్నా ఆయనే (చిరంజీవి) ఆద్యులు. నేను ఎప్పుడూ మూలాలు మరిచిపోను” అని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉన్నా.. రామ్‍చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి కారణం మెగాస్టార్ చిరంజీవే అని పవర్ స్టార్ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమ అప్పట్లో చెన్నై నుంచి తెలుగు గడ్డపైకి తేవడంలో కృషి చేసిన అలనాటి హీరోలు దివంగత ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులను గుర్తు చేసుకున్నారు పవన్. వారిని కూడా ఎప్పటికీ మరువబోమని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎంగా వారి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. టాలీవుడ్‍కు మూలాలు వారేననేలా మాట్లాడారు. రఘుపతి వెంకయ్య, దాదా సాబెల్ ఫాల్కే సహా మరికొందరు సినీ దిగ్గజాల పేర్లను పవన్ ప్రస్తావించారు.
అల్లు అర్జున్‍ను ఉద్దేశించి అన్నారా!
మూలాలను మరిచిపోకూడదని పవన్ అనడంతో సోషల్ మీడియాలో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. అల్లు అర్జున్‍పైనే పవన్ పరోక్షంగా కామెంట్స్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి వల్లే సినీ ఇండస్ట్రీలో మద్దతు దక్కించుకున్న, ఎదిగిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఎక్కడా ఆయన పేరే ప్రస్తావించడం లేదని, అందుకే మూలాలు మరవొద్దనే మాటలను పవన్ అన్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెగా ఫ్యామిలీతో సంబంధం లేదన్నట్టుగా కొన్నేళ్లుగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారని, దాన్నే పవన్ గుర్తు చేశారని అంటున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‍కు ఇటీవల ప్రతికూల పరిస్థితి ఎదురయ్యాయి. ఓ రోజు జైలులో ఉండాల్సి రావడం సహా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిశారు ఐకాన్ స్టార్. గతేడాది ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడినట్టు కనిపించింది. ఇటీవల అరెస్ట్ తర్వాత ఈ పరిస్థితి మారినట్టు కనిపించింది.
ఎవరినీ ద్వేషించం
అందరి హీరోల సినిమాలు ఆడాలని తాము అనుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ పేర్లను ప్రస్తావించారు. వీరితో పాటు హీరోలందరి చిత్రాలు విజయాలు సాధించాలని తమ కుటుంబం అనుకుంటుందని చెప్పారు. ఏ హీరో చిత్రం కూడా పోవాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. తాము ఎప్పటికీ ఏ హీరోను కూడా ద్వేషించబోమని పవర్ స్టార్ స్పష్టం చేశారు.
శంకర్ దర్శకత్వంలో రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీని దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‍తో నిర్మించారు.
సంబంధిత కథనం
టాపిక్