Vijay Sethupathi: ఆ విషయాన్ని ఇక వదిలేయండి: కృతి శెట్టిపై ప్రశ్నకు విజయ్ సేతుపతి రియాక్షన్
Vijay Sethupathi - Krithi Shetty: తన సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‍గా ఎందుకు వద్దన్నారంటూ విజయ్ సేతుపతికి మరోసారి ప్రశ్న ఎదురైంది. దీంతో ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పానంటూనే.. మరోసారి వివరించారు. ఇక ఆ విషయాన్ని వదిలేయాలని కోరారు.
Vijay Sethupathi: ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించారు తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ మూవీతో తెరంగేట్రం చేసిన వైష్ణవ్, కృతి పాపులర్ అయ్యారు. అయితే, ఆ తర్వాత డీఎస్‍పీ అనే ఓ తమిళ సినిమాలో విజయ్ సేతుపతి పక్కన కృతి శెట్టిని హీరోయిన్‍గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. అయితే, ఉప్పెనలో తండ్రిగా నటించి.. ఇప్పుడు ఆమెకు జోడీగా చేయడం బాగోదని విజయ్ సేతుపతి వద్దని చెప్పారు. అయితే, కృతిని ఎందుకు వద్దన్నారనే విషయంపై ఇప్పటికే విజయ్ చాలాసార్లు మీడియా సమావేశాల్లో సమాధానాలు ఇచ్చారు. అయితే, మరోసారి ఆయనకు అదే ప్రశ్న ఎదురైంది. మహారాజా సినిమా తెలుగు వెర్షన్ కోసం హైదరాబాద్‍లో నేడు (జూన్ 10) నిర్వహించిన మీడియా సమావేశంలో కృతి గురించి విజయ్‍కు ప్రశ్న వచ్చింది.
చాలాసార్లు చెప్పా.. కృతి కూడా వద్దనేది
కృతి శెట్టి విషయంలో తాను సార్లు సమాధానం చెప్పానని విజయ్ సేతుపతి అన్నారు. ఈ ప్రశ్న తనను వెంటాడుతూనే ఉందని, ఇక వదిలేయాలని ఆయన చెప్పారు. అయినా మరోసారి వివరించారు. ఉప్పెన సమయంలో తనను తండ్రిగా భావించాలని కృతికి చెప్పానని, అలాంటప్పుడు హీరోయిన్‍గా తీసుకోవడం కరెక్ట్ కాదని అనిపించిందని సేతుపతి అన్నారు.
తనతో హీరోయిన్‍గా కృతి శెట్టిని ముందుగా అడిగి ఉండే.. ఆమె కూడా వద్దనే వారని విజయ్ సేతుపతి అన్నారు. “నేను చాలాసార్లు సమాధానాలు ఇచ్చా. ఎవరైనా కృతిని అడిగినా ఆమె కూడా నో చెప్పేదని అనుకుంటున్నా. ఒక దర్శకుడు కృతిని తీసుకోవాలని అడిగారు. ఉప్పెన సినిమాను 2019లో చేశా. 2021లో చేసే మూవీకి హీరోయిన్‍గా కృతిని అడుగుతామని డైరెక్టర్ చెప్పారు. అయితే, కృతిని అడగొద్దని నేను చెప్పా. ఇబ్బందిగా ఫీల్ కాకుండా నన్ను తండ్రిగా భావించాలని కృతికి ఉప్పెన క్లైమాక్స్‌కు ముందు నేను చెప్పా. అందుకే హీరోయిన్‍గా వద్దనుకున్నా” అని విజయ్ సేతుపతి అన్నారు.
గొప్పేం కాదు.. వదిలేయండి
అయితే, ఇతర నటీనటులతో దీన్ని పోల్చవద్దని విజయ్ సేతుపతి చెప్పారు. కథకు అవసరమైతే వాళ్లు నటిస్తారని అన్నారు. తండ్రిగా భావించాలని తాను స్వయంగా కృతి శెట్టికి చెప్పానని, అందుకే ఆమెను తన పక్కన హీరోయిన్‍గా వద్దన్నానని సేతుపతి తెలిపారు. ఇందులో గొప్పేం లేదని చెప్పారు. “ఈ ప్రశ్న నన్ను వెంటాడుతోంది. ఈ విషయాన్ని వదిలేయండి” అని సేతుపతి అన్నారు.
మహారాజ సినిమా గురించి..
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగునూ రిలీజ్ కానుంది. ఈ మూవీకి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నాటీ, భారతీరాజా, అభిరామి, సింగంపులి కీరోల్స్ చేశారు.
మహారాజ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. లక్ష్మిని దొంగలించారంటూ మహారాజ (విజయ్ సేతుపతి) పోలీస్ స్టేషన్‍కు వెళతారు. అయితే, ఆ లక్ష్మి మనిషి కాదు. అదేంటో కూడా చెప్పకుండా కేవలం సైగలు చేస్తుంటాడు మహారాజ. ఓ క్రైమ్ జరిగినట్టు కూడా ట్రైలర్లో ఉంది. మొత్తంగా మహారాజ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. విజయ్ సేతుపతికి ఇది హీరోగా 50వ సినిమా.