హీరోయిన్ కేథరిన్ థ్రెసా.. చమ్మక్ చల్లో (2013) అనే సినిమా ద్వారా టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరమ్మాయిలు మూవీతో తెలుగులో పాపులర్ అయ్యారు. నేనే రాజు నేనే మంత్రి, సరైనోడు, బింబిసార, వాల్తేరు వీరయ్య సహ తెలుగులో మరిన్ని సినిమాలు చేశారు. కన్నడ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫీలింగ్ బయటపెట్టారు కేథరిన్.
తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ దాటి మరింత ప్రూవ్ చేసుకునే అవకాశాలు సరిగా రాలేదని కేథరిన్ థ్రెసా తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. “నటిగా నన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని నేను ఫీల్ అవుతున్నా. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నేను ఇంకా చాలా చేయగలను. నా ఇమేజ్‍ను దాటి పర్ఫార్మ్ చేయడానికి నాకు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు. నాలో చాలా సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నా” అని కేథరిన్ చెప్పారు.
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేథరిన్ తెలిపారు. “నేను ప్రధాన పాత్రలో ఉండే ప్రాజెక్టులు చేయాలని ఉంది. అలా అయితే నా నటనా సామర్థ్యాన్ని పూర్తిగా చూపించే అవకాశం ఉంటుంది” అని కేథరిన్ చెప్పారు.
తాను ఇప్పటి వరకు చేసిన వాటి కంటే ‘ఫణి’ మూవీలో చేస్తున్నది ఛాలెంజింగ్ రోల్ అని కేథరిన్ తెలిపారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. స్క్రీన్ ప్రెజెన్స్, డెప్త్ విషయాలతో పోలిస్తే తన గత చిత్రాల కంటే ఎక్కువగా ఫణిలో ఉంటుందని అన్నారు. ఈ సినిమా కోసం బతికి ఉన్న పాముతో షూటింగ్ చేశానని, అది దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయమేసిందని అన్నారు. అది కూడా ఈ చిత్రంలో యాక్టింగ్‍కు ఉపయోగపడిందని చెప్పారు.
తాను సినిమాలు చేసేటప్పుడు భాష గురించి ఎక్కువగా ఆలోచించలేదని కేథరిన్ అన్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ కావడమే ముఖ్యమని చెప్పారు. “నేను చాలా భాషలను అనర్గళంగా మాట్లాడలేను. ప్రేక్షకులతో కనెక్ట్ అవడమే ముఖ్యం. సినిమా అలా ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను ఫీల్ అవుతా” అని కేథరిన్ అన్నారు.
సంబంధిత కథనం