Ranbir Kapoor: ఆ తెలుగు హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే: రణ్‍బీర్ కపూర్
Ranbir Kapoor: యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్.. అన్‍స్టాపబుల్ టాక్ షోకు వచ్చారు. చాలా విషయాలను పంచుకున్నారు. హోస్ట్ బాలకృష్ణతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా తాను తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోకు పెద్ద ఫ్యాన్ అని రణ్‍బీర్ చెప్పారు. ఆ వివరాలివే..
Ranbir Kapoor: నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ టాక్ షోకు బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ వచ్చారు. యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణ్‍బీర్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఆ షోలో పాల్గొన్నారు. బాలయ్యతో కలిసి సందడి చేశారు. చాలా విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రణ్‍బీర్ కపూర్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్‍షిప్ ఎవరితో చేయాలనుందో చెప్పారు. ఆ వివరాలివే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో రణ్‍బీర్ కపూర్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో గెస్ చేయాలని రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించారు బాలకృష్ణ. దీంతో వారు స్లేట్‍లపై పేర్లు రాశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను, సందీప్.. రణ్‍బీర్‌కు క్లోజ్ ఫ్రెండ్స్ అని రష్మిక రాశారు. అయితే, ప్రభాస్ అని సందీప్ రెడ్డి వంగా రాశారు. దీంతో రణ్‍బీర్ స్పందించారు. ప్రభాస్ ప్రస్తుతం తన క్లోజ్ ఫ్రెండ్ కాదని చెప్పారు. తనకు కూడా ప్రభాస్‍తో స్నేహం చేయాలని ఉందని అన్నారు. తాను ప్రభాస్‍కు పెద్ద ఫ్యాన్ అని రణ్‍బీర్ చెప్పారు.
“నాకు కూడా ఆయన (ప్రభాస్)తో స్నేహం చేయాలని ఉంది. కానీ ఆయన చేయరు. నేను ఆయనకు అభిమానిని. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరే (రష్మిక, సందీప్) నాకు స్నేహితులు” అని రణ్‍బీర్ చెప్పారు. అలాగే, ప్రభాస్‍తో సందీప్ చేసే తర్వాతి సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా తాను చేస్తానని రణ్‍బీర్ చెప్పారు.
“ఆయన (సందీప్ రెడ్డి) తర్వాతి సినిమా ప్రభాస్ అన్నతో ఉంది. ఆ చిత్రంలో నాకు చిన్న రోల్ ఇచ్చినా చేసేందుకు నేను ఇష్టపడతా” అని రణ్‍బీర్ చెప్పారు. దీంతో పక్కనే ఉన్న రష్మిక కూడా చప్పట్లు కొట్టారు. ప్రభాస్ - సందీప్ కాంబినేషన్‍లో స్పిరిట్ అనే టైటిల్‍తో మూవీ రూపొందనుంది.
అన్‍స్టాపబుల్ షోలో బాలకృష్ణతో కలిసి రణ్‍బీర్ డ్యాన్స్ చేశారు. బాలయ్య డైలాగ్ చెప్పారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ సందడిగా సాగింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అన్‍స్టాపబుల్‍కు బాలీవుడ్ హీరో రావడం ఇదే తొలిసారి.
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా వచ్చిన యానిమల్ ట్రైలర్ అదిరిపోయింది. వైలెన్స్, సెంటిమెంట్‍తో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.