How Krishna Became Superstar: కృష్ణ సూపర్‌స్టార్ ఎలా అయ్యాడు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?
How Krishna Became Superstar: కృష్ణ సూపర్‌స్టార్ ఎలా అయ్యాడు? ఎందుకు అతన్ని అందరూ సూపర్ స్టార్ అని పిలుస్తారు? నిజానికి దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో చూడండి.
How Krishna Became Superstar: టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుఝామున 4 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన కృష్ణ.. సాహసాలకు పెట్టింది పేరన్న విషయమూ అందరికీ తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, సినిమా స్కోప్, కౌబాయ్, జేమ్స్ బాండ్ మూవీలు తీసిన ఘనత కృష్ణ సొంతం.
అయితే ఘట్టమనేని శివకృష్ణమూర్తి సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? అతనికి ఆ బిరుదు ఎలా వచ్చింది అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే ఉంది. ఇప్పుడంటే సూపర్‌స్టార్, మెగాస్టార్, స్టైలిష్ స్టార్, పవర్ స్టార్‌లాంటివి సర్వసాధారణం. కానీ ఆ రోజుల్లో ఓ హీరోకు సూపర్ స్టార్ అనే పదం అంత సులువుగా దొరికేది కాదు.
సూపర్‌స్టార్.. ఏంటా స్టోరీ?
నిజానికి అభిమానులే కృష్ణను సూపర్ స్టార్‌ను చేసింది. అది కూడా తమ ఓట్ల ద్వారా కావడం విశేషం. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఈనాడులాంటి విలక్షణమైన సినిమాలు చేసిన కృష్ణను అభిమానులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో అప్పట్లో ఓ తెలుగు, తమిళ మ్యాగజైన్ ఒకటి ఓ పోల్ నిర్వహించింది. ఇప్పటిలాగా అప్పట్లో సోషల్ మీడియాలో సులువుగా జరిగిపోయే పోల్ కాదు అది.
పోస్ట్ ద్వారా ఓట్లు వేసి మరీ తమ అభిప్రాయాలను చెప్పాలి. అలా సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అన్న పోల్‌ను ప్రతి ఏటా ఆ మ్యాగజైన్ నిర్వహించేది. ఇందులో వరుసగా ఐదేళ్ల పాటు కృష్ణ టాప్‌లో నిలవడం విశేషం. దీంతో అప్పటి నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కృష్ణను సూపర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. అసలు విశేషం ఏమిటంటే.. రెండేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కృష్ణనే ఈ విషయాన్ని వెల్లడించాడు.
ప్రొడ్యూసర్ల హీరోగా కృష్ణకు పేరుంది. తనను నమ్మి సినిమా చేసిన నిర్మాత ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణ. ఒక సినిమా ఫ్లాపయి సదరు నిర్మాత కష్టాల్లో పడితే.. తర్వాతి సినిమాను ఫ్రీగా చేసిపెట్టి హిట్ ఇచ్చిన మొనగాడు అతడు. అలాంటి హీరో నిజంగా సూపర్ స్టారే అనడంలో సందేహం ఏముంది?
టాపిక్