Demonte Colony 2: సుస్సు పోయిస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ
Demonte Colony 2 Trailer Released By RGV: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హారర్ మూవీ డిమోంటీ కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది డీమోంటీ కాలనీ 2. తాజాగా డీమోంటీ కాలనీ 2 తెలుగు ట్రైలర్‌ను సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు.
Demonte Colony 2 Trailer RGV: బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ డీమాంటీ కాలనీకి సీక్వెల్‌గా రూపొందిన సినిమా డిమోంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ హారర్ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు తెరకెక్కించిన డిమోంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా డీమోంటీ కాలనీ 2 మూవీ తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
డిమోంటీ కాలనీ 2 ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పిన డైరెక్టర్ ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక డిమోంటీ కాలనీ 2 ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. ప్రారంభంలోనే ఒకతను తల కిందకు కాళ్లు పైకి పెట్టి వేలాడుతూ కనిపిస్తాడు. అంతేకాకుండా తనను తానే కత్తితో నరుక్కోవడం చాలా థ్రిల్లింగ్‌గా, హార్రిఫిక్‌గా చూపించారు. మొదటి సీన్‌తోనే సినిమాలో హారర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించారు.
ఆ తర్వాత మొదటి సినిమాలోని క్లైమాక్స్ సీన్ చూపించారు. అనంతరం డిమోంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికే ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు.
ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డిమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ట్రైలర్‌లో గూస్ బంప్స్ తెప్పించడం కాదు సుస్సు పోయించేలా ఉంది. అలాగే ట్రైలర్ ఎండింగ్‌లో రఘు పాత్ర బిల్డింగ్ నుంచి కింద పడిపోతుంటే వచ్చే గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి.
మమ్మీ రిటర్న్స్ సినిమా తరహాలో నేలపై నుంచి దుమ్ము ధూళితో ఓ ఆకారం వచ్చి రఘును మింగేసేలా నోరు తెరవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే, డిమోంటీకి సంబంధించిన గతాన్ని ఈ సీక్వెల్‌లో చూపించినట్లు తెలుస్తోంది. ఓ గ్రౌండ్‌లో రక్తంతో డిమోంటీ కనిపించడం ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మొత్తానికి హారర్ సన్నివేశాలతో, ఇంట్రెస్టింగ్ ప్లాట్‌తో డిమోంటీ కాలనీ 2 సినిమాను డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.
కాగా డిమోంటీ కాలనీ 2 చిత్రంలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్‌తోపాటు అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక తమిళంలో హారర్, థ్రిల్లర్ సినిమాలకు అరుల్ నిధి పెట్టింది పేరు. అరుల్ నిధి సినిమాలన్ని దాదాపుగా ఇలాంటి జోనర్‌లోనే ఉంటూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
టాపిక్