Horror Comedy Movie Trailer: మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా
Horror Comedy Movie Trailer: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 ట్రైలర్ రిలీజైంది. మరింత నవ్విస్తూ, భయపెడుతూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది.

Horror Comedy Movie Trailer: హారర్ కామెడీ జానర్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న వేళ అలాంటిదే మరో మూవీ వస్తోంది. నిజానికి ఆరేళ్ల కిందట వచ్చిన స్త్రీ మూవీకి ఇది సీక్వెల్. స్త్రీ2గా వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ గురువారం (జులై 18) రిలీజైంది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ లతోపాటు తమన్నా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.
స్త్రీ2 ట్రైలర్ రిలీజ్
2018లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన హారర్ కామెడీ మూవీ స్త్రీ. అయితే రిలీజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఆరేళ్ల తర్వాత స్త్రీ2 పేరుతో సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ కానుండగా.. గురువారం (జులై 18) ట్రైలర్ రిలీజ్ చేశారు. స్త్రీ, భేడియా, ముంజ్యాలాంటి హారర్ సినిమాలు తీసిన మాడక్ ఫిల్మ్స్ ఈ సినిమాను తెరకెక్కించింది.
అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన స్త్రీ2 మూవీ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ నవ్వులు, భయం గ్యారెంటీ అనేలా ట్రైలర్ తోనే చెప్పేశారు. ఈ స్త్రీ2లో సర్కటే అనే ఓ కొత్త దెయ్యాన్ని పరిచయం చేయబోతున్నారు. కేవలం తల మాత్రమే ఉండే ఈ దెయ్యం అక్కడి ఊళ్లో వాళ్లను భయపెడుతూ ఉంటుంది. ఈ దెయ్యం ఆట కట్టించడానికి సినిమాలో ముఖ్య పాత్రలైన విక్కీ, జానా, బిట్టు ఏం చేశారన్నదే స్త్రీ2 స్టోరీ.
ఈ కొత్త సర్కటేను ఎదుర్కోవడానికి విక్కీ (రాజ్ కుమార్ రావ్) దెయ్యంలాంటి గర్ల్‌ఫ్రెండ్ (శ్రద్ధా కపూర్) ఎంట్రీ ఇస్తుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. భయపెట్టే సీన్లతోపాటు విక్కీ అండ్ గ్యాంగ్ కామెడీ కడుపుబ్బా నవ్వించేలా సాగింది. ఈ ట్రైలర్ లో ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పాత్ర కేవలం పాట వరకే పరిమితమైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
స్త్రీ2 మూవీ గురించి..
స్త్రీ2 మూవీలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ తోపాటు పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా నటించారు. స్త్రీ మూవీ సక్సెస్ లో ఈ అందరి పాత్రా ఉంది. వీళ్ల అద్భుతమైన నటనకు తోడు కామెడీ, హారర్ సమపాళ్లలో పండటం ఆ సినిమాకు పెద్ద విజయాన్ని సాధించి పెట్టింది. అప్పటి నుంచీ ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది.
ఈ ఏడాది ఇప్పటికే శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ కుమార్ రావ్. అటు పంకజ్ త్రిపాఠీ ఈ మధ్యే మోస్ట్ అవేటెడ్ మీర్జాపూర్ సీజన్ 3లో కనిపించాడు. ఈ స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. అదే రోజు తెలుగులో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.