Horror Comedy Movie: 13 రోజుల టైమ్ ఇచ్చి చంపే దెయ్యం.. హారర్ కామెడీ మూవీ ట్రైలర్ చూశారా? నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది
Horror Comedy Movie: ఓటీటీలోకి నవ్విస్తూ భయపెట్టే మరో హారర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (జులై 2) రిలీజైంది. సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
Horror Comedy Movie: నేరుగా ఓటీటీలోకి వస్తోంది ఓ హారర్ కామెడీ మూవీ. ఈ సినిమా పేరు కాకుదా. ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం (జులై 2) రాత్రి 7.15 గంటలకు రిలీజ్ చేశారు. నిజానికి ఈ రోజు, సమయానికి మూవీకి లింకు ఉంది. అందుకే అదే రోజు, అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేశారు. సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ సినిమా ట్రైలర్ నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కాకుదా ట్రైలర్
హారర్ కామెడీ మూవీ కాకుదా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. జీ5 ఓటీటీ జులై 12 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మధ్యే రూ.100 కోట్లకు వసూలు చేసిన హారర్ కామెడీ మూవీ ముంజ్యాను డైరెక్ట్ చేసిన ఆదిత్య సర్పోదర్ ఈ కాకుదాను కూడా డైరెక్ట్ చేశాడు. ఓటీటీలో అయినా సరే ఈ మూవీ సూపర్ హిట్ కావడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది.
రాజస్థాన్ లోని రథోడీ అనే ఊరు శాపగ్రస్తమైందనీ, ఆ ఊళ్లోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు కాకుదా అనే ఓ దెయ్యం వస్తుందన్న వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ ఊళ్లో అన్ని ఇళ్లకూ రెండు డోర్లు ఉంటాయి. ఒకటి పెద్దది కాగా.. మరొకటి చిన్నది. ఆ చిన్న డోరును ఆ సమయానికి ప్రతి ఒక్కరూ తెరిచి ఉంచాలి.
ఒకవేళ ఎవరైనా తెరిచి ఉంచకపోతే మాత్రం 13 రోజుల్లో ఆ వ్యక్తి పని ఇక అయిపోయినట్లే. అలా ఓ వ్యక్తి కాకుదాకు దొరికిపోతాడు. ఆ వ్యక్తి భార్యనే ఇందిర (సోనాక్షి సిన్హా). ఇదంతా ఓ మూఢనమ్మకం అని ఆమె కొట్టిపారేస్తుంది. అంతేకాదు దెయ్యాలను పట్టుకునే వ్యక్తి (రితేష్ దేశ్‌ముఖ్)ని ఊరికి పిలిపిస్తారు. ఈ ఇద్దరూ కలిసి ఆ దెయ్యాన్ని పట్టుకుంటారా లేదా? అసలు ఆ దెయ్యం కథేంటి అన్నది సినిమాలోనే చూడాలి.
ఇంట్రెస్టింగ్ ట్రైలర్
నిజానికి కాకుదా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మధ్యే ముంజ్యాలాంటి మెగా హిట్ అందించిన డైరెక్టర్ ఆదిత్య.. మరోసారి నవ్విస్తూనే భయపెట్టాలని డిసైడయ్యాడు. ప్రతి మంగళవారం సాయంత్రం 7.15 గంటలకు ఆ శాపగ్రస్తమైన రథోడీ అనే ఊళ్లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఈ ట్రైలర్ చూస్తే కలుగుతుంది. ఇది సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేస్తుంది.
"తన భర్త సన్నీని ఓ భయంకరమైన దెయ్యం కాకుదా శపించిన వేళ ఓ దెయ్యాలు పట్టుకునే వ్యక్తితో కలిసి ఇందిర పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. ఆ శాపం తన భర్త ప్రాణాలను తీసే ముందు ఆమె అతన్ని కాపాడుకుంటుందా? జులై 12న ప్రీమియర్స్" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ ట్రైలర్ ను షేర్ చేశారు.
ముంజ్యా మూవీ థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించినా కూడా ఆదిత్య తన నెక్ట్స్ మూవీని ఇలా నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తుండటం విశేషం. మరి ఈ సినిమాతో అతడు ప్రేక్షకులను ఎంతలా భయపెడతాడో చూడాలి.