Horror Comedy Movie OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్
Horror Comedy Movie OTT: ఓటీటీలో ప్రస్తుతం ఓ హారర్ కామెడీ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మూడు రోజుల్లోనే ఆ సినిమా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.

Horror Comedy Movie OTT: హారర్ కామెడీ జానర్ ను ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడతారో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. తాజాగా ఇదే జానర్ లో రిలీజైన మూవీ జీ5 ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోంది. మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసిన కాకుదా అనే ఈ సినిమా జులై 12న ఓటీటీలోకి రాగా.. మూడు రోజుల్లోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
కాకుదా మూవీ రికార్డు
దర్శకుడు ఆదిత్య సర్పోదర్ ఈ ఏడాది రెండు సినిమాలు తీశాడు. రెండూ హారర్ కామెడీ జానర్ సినిమాలే కావడం విశేషం. అంతేకాదు రెండూ ప్రేక్షకుల ఆదరణ సంపాదించాయి. అందులో మొదటిది ముంజ్యా. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకుపైనే కొల్లగొట్టింది. అదే జానర్ లో అతడు తీసిన మరో మూవీ కాకుదా.
ముంజ్యా థియేటర్లలో హిట్ అయినా.. ఈ కాకుదాను మాత్రం అతడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడం విశేషం. గత శుక్రవారం (జులై 12) స్ట్రీమింగ్ ప్రారంభం కాగా.. తొలి మూడు రోజుల్లోనే ఈ కాకుదా మూవీ 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీయే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
కాకుదా దూకుడు
కాకుదా మూవీలో బాలీవుడ్ నటీనటులు సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్, ఆసిఫ్ ఖాన్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ట్రైలరే ఎంతో ఆసక్తి రేపింది. ఓ ఊళ్లో ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు ప్రతి ఇంటికి ఉండే ఓ చిన్న తలుపును తెరిచి ఉంచాల్సిందే. కాకుదా అనే దెయ్యం ఆ రోజు ఊళ్లోకి వస్తుంది. ఆ సమయానికి తలుపు తెరవని వారిని 13 రోజుల టైమ్ ఇచ్చి మరీ ఆ దెయ్యం చంపుతుంది.
ఈ భిన్నమైన స్టోరీ లైన్ తోనే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన మేకర్స్.. మూవీతోనూ నిరాశ పరచలేదు. స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే కాకుదా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే మూడు రోజుల్లోనే ఈ రికార్డు స్థాయి వ్యూస్ సొంతమయ్యాయి. "కాకుదాతో ఈ వీకెండ్ చాలా సరదా, భయపెట్టే వీకెండ్ గా మారిపోయింది. లాంచ్ వీకెండ్ లోనే 100 మిలియన్ పైగా వాచ్ మినట్స్ నమోదయ్యాయి. కాకుదా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత రిలీజైన తొలి మూవీ ఇదే. ఇందులో ఇందిరా అనే పాత్రలో ఆమె నటించింది. మూవీలోనూ పెళ్లయిన రెండు వారాలకే ఆమె భర్త కాకుదా దెయ్యం బారిన పడి చావు భయంతో వణికిపోతుంటాడు. దెయ్యాలేమీ లేవని, అదంతా ఉత్త మూఢనమ్మకమంటూ ఓ ఘోస్ట్ హంటర్ విక్టర్ (రితేష్ దేశ్‌ముఖ్)ను ఆ ఊళ్లోకి పిలుస్తుంది.
తర్వాత ఇద్దరూ కలిసి ఆ కాకుదాను పట్టుకుంటారా? ఆ ఊళ్లో వాళ్లను కాపాడతారా అన్నదే సినిమా స్టోరీ. భయపెడుతూనే నవ్వించే ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒకవేళ ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.