Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది
Hollywood Thrillers on OTT: హాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ కొన్ని అసలు సిసలు థ్రిల్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాయి. మరి ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ థ్రిల్లర్స్ మీరు చూశారా? చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి.
Hollywood Thrillers on OTT: థ్రిల్లర్ జానర్ మూవీస్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇలాంటి థ్రిల్లర్స్ తీయడంలో హాలీవుడ్ మేకర్స్ తమ ప్రత్యేకత చాటుకుంటారు. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ నుంచి ఎన్నో థ్రిల్లర్స్ వచ్చాయి. అందులో ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి. ఒకవేళ ఇప్పటి వరకూ మీరు వాటిని చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
ఓటీటీల్లోని హాలీవుడ్ థ్రిల్లర్స్
గాన్ గర్ల్ - నెట్‌ఫ్లిక్స్
గాన్ గర్ల్ హాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తమ ఐదో వెడ్డింగ్ యానివర్సరీ రోజు అనుకోకుండా తన భార్య కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత జరిగే ఘటనలు ఊహకందని విధంగా ఉంటాయి. మూవీ క్లైమ్యాక్స్ కు ముందు వచ్చే ట్విస్టులు హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
షటర్ ఐలాండ్ - ప్రైమ్ వీడియో
షటర్ ఐలాండ్ కూడా ఓ అధ్భుతమైన థ్రిల్లర్ మూవీ. షటర్ ఐలాండ్ లోని ఉన్న జైలులో నుంచి ఓ ఖైదీ కనిపించకుండా పోవడం, దానిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యూఎస్ మార్షల్స్ కు అక్కడ ఎదురయ్యే భయానక అనుభవాలతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ప్రిజనర్స్ - ప్రైమ్ వీడియో
ఇద్దరు పిల్లల మిస్సింగ్, వాళ్లను కనుగొనడానికి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అనే కాన్సెప్ట్ తో మంచి థ్రిల్ పంచే మూవీ ప్రిజనర్స్. 2013లో వచ్చిన ఈ హాలీవుడ్ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ - ప్రైమ్ వీడియో
40 ఏళ్లుగా కనిపించకుండా పోయిన ఓ మహిళను కనుగొనడానికి ఓ జర్నలిస్టు, ఓ కంప్యూటర్ హ్యాకర్ చేసే ప్రయత్నమే ఈ ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ మూవీ. 2011లో వచ్చిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
స్ప్లిట్ - జియో సినిమా
స్ప్లిట్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే ఓ వ్యక్తి ముగ్గురు టీనేజర్లను కిడ్నాప్ చేస్తాడు. ఏకంగా 23 రకాలుగా ప్రవర్తించే ఆ వ్యక్తిలో తమకు సహకరించే పర్సనాలిటీ ఏదో కనుగొని ఆ టీనేజర్లను విడిపించే ప్రయత్నమే ఈ మూవీ. ఈ మూవీ ప్రస్తుతం జియో సినిమాలో అందుబాటులో ఉంది.
ది డిపార్టెడ్ - ఆపిల్ టీవీ
మార్టిన్ స్కోర్సెసి డైరెక్ట్ చేసిన ది డిపార్టెడ్ మూవీ ఓ యాక్షన్ థ్రిల్లర్. ఓ అండర్ కవర్ ఏజెంట్, ఓ స్పై.. రెండు గ్యాంగ్‌ల మధ్య నడిచే స్టోరీ ఇది. ఈ సినిమా ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.
ఇన్‌సెప్షన్ - నెట్‌ఫ్లిక్స్
ఇన్‌సెప్షన్ ఓ కొత్త అనుభూతిని అందించే థ్రిల్లర్. మనుషుల డ్రీమ్స్ లోకి వెళ్లి వాళ్ల రహస్యాలను తెలుసుకొని సాగించే దోపిడీ ఇది. క్రిస్టఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.