OTT Hollywood Action Comedy: ఓటీటీలో తెలుగులోనూ రానున్న హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
The Fall Guy OTT Release date: హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ గాయ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను జియోసినిమా ఓటీటీ వెల్లడించింది.
హాలీవుడ్ సినిమా ‘ది ఫాల్ గాయ్’కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ ఏడాది మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఇండియాలో గతంలోనే రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. అయితే, రెంట్ లేకుండా మరో ఓటీటీలో అడుగుపెట్టేందుకు ‘ది ఫాల్ గాయ్’ రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా సిద్ధమైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ది ఫాల్ గాయ్ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రెంటల్ విధానంగా అందుబాటులో ఉంది. అయితే, జియోసినిమాలో సెప్టెంబర్ 3న రెంట్ అవసరం లేకుండా పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు రానుంది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు.
ఏడు భాషల్లో..
ది ఫాల్ గాయ్ సినిమా జియోసినిమా ఓటీటీలో సెప్టెంబర్ 3న ఏడు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే జియోసినిమా ఓటీటీలో ఈ మూవీ లిస్ట్ అయింది. సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ షురూ కానుంది.
టీవీ సిరీస్ ఆధారంగా..
ది ఫాల్ గాయ్ చిత్రానికి డేవిడ్ లెట్చ్ దర్శకత్వం వహించారు. 1980ల్లో వచ్చిన ది ఫాల్ గాయ్ అనే టీవీ సిరీస్ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 3న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై పాజిటివ్ స్పందన దక్కించుకుంది. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, ఎమిలీ బ్లంట్‍తో పాటు ఆరోన్ టేలర్ - జాన్సన్, థెరెసా పాల్మర్, స్టెఫానీ, విన్‍స్టన్ డ్యూక్, హన్నా వడ్డింగ్‍హామ్ కీలకపాత్రలు పోషించారు.
ది ఫాల్ గాయ్ చిత్రాన్ని 87 నార్త్ ప్రొడక్షన్స్, ఎంటర్‌టైన్‍మెంట్ 360 బ్యానర్లపై కెర్రీ మెక్‍కార్మిక్, డేవిడ్ లెట్చ్, గయ్మోన్ కసాడీ, ర్యాన్ గోస్లింగ్ నిర్మించారు. డొమినిక్ లూయిస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎలిసబెత్ రోనాల్డ్స్ డొరిట్ సినిమాటోగ్రఫీ చేశారు.
ది ఫాల్ గాయ్ స్టోరీలైన్
స్టంట్ మ్యాన్‍గా పని చేసే కోల్ట్ సీవర్స్ (ర్యాన్ గోస్లింగ్) ప్రమాదానికి గురై కోలుకుంటుంటాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ జోడీ (ఇమిలీ బ్లంట్) డైరెక్షన్ చేసే చిత్రానికి పని చేసేందుకు మళ్లీ అతడు రెడీ అవుతాడు. అయితే, ఆ సినిమా మెయిన్ హీరో టామ్ రైడర్ (ఆరోన్ టేలర్) సడెన్‍గా మిస్ అవుతాడు. అయితే, అతడి స్టంట్ డబుల్‍గా సీవర్స్ నటిస్తాడు. ఇంతలో ఓ కేసులో చిక్కుకుంటాడు. మరి సీవర్స్ ఈ చిక్కుల్లో నుంచి బయటపడ్డాడా? అతడి గర్ల్ ఫ్రెండ్ సక్సెస్‍ఫుల్‍గా సినిమా కంప్లీట్ చేశారా? మిస్ అయిన టామ్ రైడర్ పరిస్థితి ఏంటి? అనే అంశాలు ఈ ఫాల్ గాయ్ సినిమాలో ప్రధానంగా ఉంటాయి. లవ్ స్టోరీ, యాక్షన్ సీన్లు, కామెడీతో ఈ చిత్రం ఉంటుంది. స్టంట్స్ కూడా ఆకట్టుకుంటాయి.