Highest TRP Telugu Movies: మొదట థియేటర్లు, తర్వాత ఓటీటీ.. చివరికి టీవీల్లోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ కాలంలో కాస్త శాటిలైట్ ఛానెల్స్ కు డిమాండ్ తగ్గినా.. ఓ రెండేళ్ల కిందటి వరకూ కూడా కొత్త సినిమాలను ఛానెల్స్ లో చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. దీంతో టీవీల్లోనూ సినిమాలకు మంచి టీఆర్పీ వచ్చేది. మరి అలా అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకున్న టాప్ తెలుగు సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
తెలుగులో అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాల జాబితాలో టాప్ 5 చూస్తే.. నాలుగు అల్లు అర్జున్, మహేష్ బాబులకు చెందిన మూవీసే ఉండటం విశేషం. దీనిని బట్టి ఈ స్టార్లకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తెలుగులో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాగా అల వైకుంఠపురంలో నిలిచినట్లు ఇప్పటికే కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. ఈ సినిమాకు ఏకంగా 29.4 రేటింగ్ రావడం గమనార్హం. ఈ మూవీ జెమిని టీవీలో టెలికాస్ట్ అయింది. 2020లో సంక్రాంతి సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ మూవీ.. తర్వాత టీవీల్లోనూ అదే రిపీట్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ రెండోస్థానంలో ఉంది. ఈ సినిమాకు టీవీలో 23.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. విచిత్రంగా ఈ మూవీ కూడా 2020లోనే సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. ఈ రెండు సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ దగ్గరే కాదు.. టీవీల్లోనూ టీఆర్పీలతో అదరగొట్టాయి.
ఈ రెండు సినిమాలకు ముందు టీవీల్లో అత్యధిక టీఆర్పీ రికార్డు ప్రభాస్ బాహుబలి 2 పేరిట ఉండేది. ఈ సినిమా 2017లో రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికీ తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉన్న ఈ మూవీ టీవీలో 22.7 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులతో పోలిస్తే ఇది కాస్త తక్కువనే చెప్పాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మరో సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు. ఈ సినిమా కూడా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత టీవీ ప్రీమియర్ లోనే 22.5 టీఆర్పీ సాధించింది. 2016లో ఈ మూవీ రిలీజైన విషయం తెలిసిందే.
2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప మూవీ కూడా తర్వాత టీవీ ప్రీమియర్ లో 22.5 టీఆర్పీని సొంతం చేసుకుంది. తెలుగులో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. టీవీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
తెలుగులో అత్యధిక టీఆర్పీ ఉన్న టాప్ 5 సినిమాలు ఇవే. ఇక ఆరు నుంచి పది స్థానాల వరకూ చూస్తే.. దువ్వాడ జగన్నాథం (21.7), బాహుబలి 1 (21.54), ఫిదా (21.31), గీత గోవిందం (20.8), జనతా గ్యారేజ్ (20.69), మహానటి (20.21) ఉన్నాయి.
టాపిక్