Heroine Casting Couch: మంచం ఎక్కమంటే ఎక్కాల్సిందే.. నో చెప్పడానికి లేదు.. నాకూ జరిగింది: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Heroine Casting Couch: ఎవరైనా మంచం ఎక్కమంటే ఎక్కాల్సిందే తప్ప నో చెప్పడానికి లేదు అని తమిళ నటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టులపై తాజాగా తమిళ హీరోయిన్ సనమ్ శెట్టి స్పందించింది.
Heroine Casting Couch: మలయాళ సినిమా ఇండస్ట్రీలో 17 రకాల లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఈ మధ్యే జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో కొందరు హీరోయిన్లు మరోసారి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. తాజాగా తమిళ నటి సనమ్ శెట్టి కూడా దీనిపై షాకింగ్ కామంట్స్ చేసింది. ఎవరైనా మంచం ఎక్కాలంటే ఎక్కాల్సిందే తప్ప నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని అనడం గమనార్హం.
సనమ్ శెట్టి ఏమన్నదంటే?
మలయాళ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపులపై హేమ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత హిందుస్థాన్ టైమ్స్ తో సనమ్ శెట్టి మాట్లాడింది. ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతోందని చెప్పింది. "హేమ కమిటీ రిపోర్టు వివరాలు నాకు తెలియదు. కానీ ఈ చర్య మంచిదే. ఇలాంటి రిపోర్టు తీసుకొచ్చిన హేమ, కేరళ ప్రభుత్వానికి థ్యాంక్స్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ నో చెప్పడానికి వీల్లేదు. నా సొంత అనుభవంతో చెబుతున్న మాట ఇది" అని ఆమె చెప్పడం గమనార్హం.
ఇదే విషయం ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే తనకు కోపం వస్తుందని, చెప్పుతో కొడతా అంటూ ఫోన్ పెట్టేస్తానని సనమ్ తెలిపింది. "ఇండస్ట్రీలో ఇలాంటి వాటిపై నేను మాట్లాడుతూనే ఉన్నాను. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. మహిళలే కాదు పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. అలాంటి వాటికి నేను దూరం. నాకు టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నమ్ముతాను" అని సనమ్ చెప్పింది.
ఏంటీ హేమ కమిటీ రిపోర్టు?
మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను గత సోమవారం (ఆగస్ట్ 19) కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు మంచం ఎక్కాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం గమనార్హం.
ఈ రిపోర్టులపై టొవినో థామస్, పార్వతి తిరువోతులాంటి మలయాళ నటీనటులు స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలని టొవినో డిమాండ్ చేశాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ పవర్ ఫుల్ లాబీ ఉందని పార్వతి వెల్లడించింది. అటు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కూడా ఈ రిపోర్టుపై స్పందించింది. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్, మలయాళ నటుడు దిలీప్ సైకోలని ఆమె అనడం గమనార్హం.
ఈ దిలీప్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతోనే హేమ కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ కమిటీలు, రిపోర్టులు అన్నీ పనికి రానివని కూడా తనుశ్రీ అభిప్రాయపడింది. మొత్తంగా ఇండస్ట్రీలో 17 రకాలుగా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఈ రిపోర్టులో చెప్పడం సంచలనం కలగించింది.