తెలుగులో కామెడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు మరో సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా 'సోదరా' అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా మరో హీరోగా నటించాడు. సోదరా సినిమాకు మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వం వహించారు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా సోదరా మూవీని నిర్మించారు.
సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్బంగా సోదరా హీరోల్లో ఒకరైన సంజోష్ మీడియాతో ముచ్చటించాడు. సోదరా సినీ విశేషాలను పంచుకున్నాడు.
హీరో సంజోష్ మాట్లాడుతూ.. "నేను ఇంతకు ముందు బేవర్స్ అనే సినిమాలో హీరోగా నటించాను. సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్ అని ట్యాగ్ పెట్టాడు" అని అన్నాడు.
"ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయినా తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదు. ఈ సినిమా చూసిన తరువాత అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా పూర్తవగానే అన్నకు తమ్ముడు, తమ్ముడు అన్నకు తప్పనిసరిగా ఫోన్ చేసి మాట్లాడుతారు. అంతలా అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది" అని సంజోష్ తెలిపాడు.
"అన్నదమ్ములు కలిసి ఉండాలి అనికోరుకునే ఎమోషనల్ కథ ఇది. అందరికి తమ రియల్‌లైఫ్ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో బాబుమోహన్ పాత్ర చాలా బాధ్యత గల రోల్. మాకు ఫాదర్‌గా నటించారు. నాకు ఇంతకుముందే సంపూతో పరిచయం ఉంది. ఈ పాత్రకు సంపూర్ణేష్‌కు సరిపోతుందని, ఆయన చేస్తే సర్‌ప్రైజ్‌గా ఉంటుందని అనుకున్నాం. సంపూ కూడా కథ వినగానే ఓకే అన్నారు. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు" అని సంజోష్ పేర్కొన్నాడు.
"స్వచ్ఛతకు మారుపేరుగా అన్నదమ్ముల అనుబంధం ఉండాలి. ఈ రోజుల్లో మాత్రం అలాంటి అనుబంధం కరువైపోయింది. ఎక్కడో కానీ అలాంటి అనుబంధాలు చూడటం లేదు. ఈ సినిమా చూసిన తరువాత ఒకరిద్దరూ మారిన మాకు సంతోషమే. ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధం అందరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది" అని హీరో సంజోష్ చెప్పుకొచ్చాడు.
"సంపూ నేను మంచి వ్యక్తిత్వాలు ఉన్న మనుషులం. మా ప్రయాణ బాగుంది. ఇక త్వరలోనే నేను సోలో హీరోగా రియల్ ఇన్‌సిడెంట్ కథతో సినిమా చేస్తాను. ఒక ఇగోయిస్ట్ పోలీస్ ఆఫీసర్‌కు కామన్ మ్యాన్‌కు జరిగే కథతో సినిమా ఉంటుంది" అని తన అప్‌కమింగ్ మూవీ గురించి చెప్పాడు హీరో సంజోష్.
సంబంధిత కథనం