విడుదలకు ముందే అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది 'ముత్తయ్య' సినిమా. యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ చిన్న సినిమాను భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. ఈ చిత్రంలో కే సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నేచరల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. అంతేకాకుండా టీజర్ అద్యంతం మనస్సుకు హత్తుకునేలా ఉందని ట్వీట్ చేశారు.
24 వయస్సులో నేను అష్టా చమ్మా సినిమా చేయకపోయినట్లయితే.. 70 ఏళ్ల వయస్సులో ముత్తయ్య మాదిరిగా మిగిలిపోయే వాడిని. హృదయాన్ని హత్తుకునేలా ఈ సినిమా టీజర్ ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు అని నాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చిత్ర టీజర్ గమనిస్తే.. ఒక పల్లెటూరిలో నివసించే 74 ఏళ్ల ముత్తయ్యకు నాటకాలంటే పిచ్చి. ఎప్పటికైనా సినిమాలో నటించాలని, వెండితెరపై తనను చూసుకోవాలని అనుకుంటాడు. చిన్నతనం నుంచి నాటకాల్లో నటించడం వల్ల ఆ కోరిక బలంగా నాటుకుపోతుంది. ఏడు పదుల వయస్సులో సినిమాలో నటిస్తానంటే ఊరి వాళ్లంతా ఎగతాళి చేస్తుండటం, నవ్వుతూ ఉండంట చేస్తుంటారు. ఈ వృద్ధుడికి ఓ యువకుడి సహాయం చేస్తుంటాడు. ముత్తయ్యను అందంగా తయారు చేసి ఫొటోలు, వీడియోలు తీసి అతడి నటనను పొగిడేస్తు ఉంటాడు. మరి ముత్తయ్య తన చిరకాల వాంఛ నేరవేర్చుకున్నాడా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలను దర్శకుడు ప్రేక్షకులకే వదిలిపెట్టాడు. టీజర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు.
ఈ చిత్రం మే 9న యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగమ్ శెట్టి, వంశీ కారుమంచి సమర్పిస్తుండగా.. వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్