Hatya Movie Review: హత్య మూవీ రివ్యూ - సీఎం బాబాయిని చంపింది ఎవరు? లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Hatya Movie Review: పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన హత్య మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజ రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.
Hatya Movie Review: ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజ రామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ హత్య. యథార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీకి శ్రీవిద్య బవస దర్శకత్వం వహించారు. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

సీఎం బాబాయ్‌ని చంపింది ఎవరు?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ రెడ్డి (భరత్ రెడ్డి) బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అతడి చిన్నాన్న జేసీ ధర్మేంద్ర రెడ్డి (రవివర్మ) చనిపోతాడు. అతడిది మర్డర్ అని తేలుతుంది.ధర్మేంద్ర రెడ్డి మర్డర్ కేసును సాల్వ్ చేసే బాధ్యతను ఐపీఎస్ ఆఫీసర్ సుధ (ధన్య బాలకృష్ణ) చేపడుతుంది. అసలు ధర్మేంద్ర రెడ్డి ఎలా చనిపోయాడు? సుధ ఇన్వేస్టిగేషన్‌లో ఏం తేలింది? ధర్మేంద్ర రెడ్డికి సలీమా ( పూజ రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏమిటి? అయిన వారే ధర్మేంద్రను చంపించారా? రాజకీయ కక్షల వల్లే చనిపోయాడా? ధర్మేంద్ర హత్యకు అతడి కూతురు కవితమ్మ (హిమబిందు)కు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మిస్టరీ....
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. 2019 ఎన్నికలకు నెల రోజుల తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. వివేకానందరెడ్డి మర్డర్ నేపథ్యంలోనే హత్య మూవీని డైరెక్టర్ శ్రీవిద్య బసవ తెరకెక్కించారు.
ఈజీగా తెలిసిపోతుంది.
హత్య మూవీ పూర్తిగా ఫిక్షనల్ అని డైరెక్టర్ చెప్పారు. కానీ ఇది వివేకానందరెడ్డి మర్డర్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని రాజకీయాల పట్ల జీరో నాలెడ్జ్ ఉన్న వారికి కూడా ఈజీగా తెలిసిపోతుంది. సినిమాలోని పాత్రల పేర్లను బట్టి రియల్ వ్యక్తులు ఎవరన్నది అర్థమైపోతుంది. క్యారెక్టర్స్‌లో రియల్ వ్యక్తులనే ఆడియెన్స్ ఊహించుకునేలా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
క్రియేటివ్ ఫ్రీడమ్...
ధర్మేంద్ర మర్డర్ తర్వాత ఏం జరిగింది అన్నది చూపిస్తూనే...అసలు హత్య ఎలా జరిగి ఉండొచ్చు అన్నది సినిమాలో చర్చించారు. ఈ విషయంలో కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు. తన కోణంలో ధర్మేంద్ర హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది చెప్పడానికి హత్య సినిమాను ఓ వేదికగా వాడుకున్నారు.
చివరి వరకు ఎగ్జైట్‌మెంట్...
వివేకా హత్యకు సంబంధించి అప్పట్లో ఏం జరిగింది? ఎలాంటి కథనాలు ప్రచారంలోకి వచ్చాయి? ఆయన జీవితంలోని తెలియని రహస్యలు ఏమిటి? హత్యకు సంబంధించి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించిన వారు ఎవరు? ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే ఎగ్జైట్‌మెంట్‌ను చివరి వరకు కలిగిస్తూ దర్శకురాలు ఈ సినిమాను నడిపించారు.
లవ్ ట్రాక్...
ఫస్ట్ సీన్‌తోనే సినిమా ఎలా ఉండబోతుంది? జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. అందరికి తెలిసిన అంశాలతోనే ప్రథమార్థం సాగుతుంది. కథ ముందుకు కదలకుండా అక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా జరిగిందా అని ఆడియెన్ సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యే సీన్స్ పడి ఉంటే బాగుండేది. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వచ్చినట్లుగా చూపిస్తూ సెకండాఫ్‌ను మాత్రం ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు. సలీమా, ధర్మేంద్ర మధ్య లవ్‌స్టోరీని ఆడియెన్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాల్సిందే. ఓ సినిమా అనే భావనతో చూస్తే ఆ ట్రాక్ కన్వీన్సింగ్‌గా అనిపిస్తోంది.
హింస ఎక్కువ...
క్లైమాక్స్‌లో కాస్త హింస ఎక్కువైంది. కానీ తాను ఏం చెప్పాలని డైరెక్టర్ అనుకున్నారో అదే చూపించేశారు. క్లైమాక్స్ విషయంలో కొంత మందికి నచ్చదు. మరికొందరు ఇది అబద్ధం అని కొట్టిపడేసే అవకాశం ఉంది. తెలిసిన కథ కావడమే హత్య సినిమాకు ప్లస్‌తో పాటు మైనస్‌గా మారింది. ఇన్వేస్టిగేషన్ సీన్స్ నత్తనడకన సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో...
హత్య మూవీలో యాక్టింగ్ పరంగా ఐపీఎస్ ఆఫీసర్ సుధ పాత్రలో ధన్య బాలకృష్ణకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి తరహా బబ్లీ క్యారెక్టర్స్ చేసిన ధన్య...పోలీస్ పాత్రలో చక్కటి వేరియేషన్ చూపించింది. ధర్మేంద్రరెడ్డిగా రవివర్మ, సలీమా పాత్రలో పూజ రామచంద్రన్ నటన బాగుంది. కిరణ్ రెడ్డిగా భరత్ ఏపీ మాజీ సీఏంను కొన్ని చోట్ల గుర్తుచేశారు. మేనరిజమ్స్‌ను దించేశారు. లిమిటెడ్ క్యారెక్టర్స్, బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్లుగా బీజీఎమ్‌తోనే నరేష్ కుమారన్ టెన్షన్ బిల్డ్ చేశారు. డైరెక్టర్‌గా శ్రీవిద్య ఒకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్‌జీవీని గుర్తుచేసింది.
పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్...
పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ఇది. ఓ పొలిటికల్ పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా తీసినట్లుగా అనిపిస్తుంది. పాలిటిక్స్ పక్కన పెట్టి చూసుకుంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన అనుభూతి కలిగిస్తుంది.
రేటింగ్: 2.75/5