పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. మరో నెల రోజుల్లోపే హరి హర వీరమల్లు వచ్చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని జూన్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఫస్ట్ పార్ట్ హరి హర వీరమల్లు: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ కు సిద్ధమైంది. శుక్రవారం (మే 16) ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
“జీవితకాల యుద్ధానికి సిద్ధంగా ఉండండి. హరి హర వీరమల్లు కోసం జూన్ 12న మీ క్యాలెండర్ ను మార్క్ చేసుకోండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ రిలీజ్ డేట్ వెల్లడించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్రో తర్వాత రిలీజ్ కాబోతున్న పవన్ మూవీ ఇదే.
హరి హర వీరమల్లు ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్ట్. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. ఈ సినిమాను రెండు భాగాలుగా మేకర్స్ తీసుకురానున్నారు. ఇప్పుడు హరి హర వీరమల్లు: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అంటూ తొలి పార్ట్ వస్తోంది. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా మధ్యలోనే అతడు వైదొలిగాడు.
ఆ తర్వాత జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు చేపట్టాడు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో పవన్ కల్యాణ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమా నిధి అగర్వాల్ తోపాటు బాబీ డియోల్, నాజర్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహిలాంటి వాళ్లు నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.
ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో ఇక త్వరలోనే ప్రమోషన్లు మొదలు కానున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాను పవన్ కల్యాణ్ ఎలా ప్రమోట్ చేస్తాడో చూడాలి.
సంబంధిత కథనం