టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ.. ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. జూన్ 12న వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ తన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడట.
క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్ గా జూన్ 12న వస్తోందని, జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడీ రెండూ వాయిదా పడ్డాయి. మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంత వరకూ అనౌన్స్ చేయలేదు.
మూవీ రిలీజ్ ఆలస్యం అవుతున్నందున నిర్మాత ఏఎం రత్నంకు భారీ నష్టాలు వస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ తీసుకున్న తన రెమ్యునరేషన్ రూ.11 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నట్లు ఓ బజ్ క్రియేటైంది. నిజానికి ఈ మూవీ కోసం పవన్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగానే ఉంది. సుమారు రూ.50 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ కారణంగా మూవీ చాలా ఆలస్యం కావడంతో తాను తీసుకున్న అడ్వాన్స్ ను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాడు.
టాలీవుడ్ లో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్ కల్యాణ్.. సినిమాల్లో నిర్మాత మేలు కోరే వ్యక్తిగా పేరుగాంచాడు. తన సినిమాల వల్ల నిర్మాతల నష్టపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడమో లేదంటే వాళ్లకు మరో సినిమా చేయడమో అతనికి అలవాటు. గతంలో బండ్ల గణేష్ తో గబ్బర్ సింగ్ తీసింది అందుకే.
అంతకుముందు తొలి ప్రేమ మూవీలో తాజ్ మహల్ సెట్ ను కూడా అతడే వేయించడం విశేషం. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు ఆలస్యం వల్ల అతని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అటు నిర్మాత ఏఎం రత్నం కూడా తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇది తెలుసుకొని పవన్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమే.
సంబంధిత కథనం