Hanuman vs Guntur Kaaram Collections: మహేష్ బాబునే మించిన తేజ సజ్జ.. హనుమానే విజేత
Hanuman vs Guntur Kaaram Collections: సంక్రాంతి విజేతగా హనుమాన్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరు రోజుల వసూళ్లలో మహేష్ బాబునే మించేశాడు కుర్ర హీరో తేజ సజ్జ.
Hanuman vs Guntur Kaaram Collections: హనుమాన్, గుంటూరు కారం రెండూ ఒకే రోజు రిలీజయ్యాయి. మరి ఈ రెండింట్లో సంక్రాంతి విజేత ఎవరు? ఈ ప్రశ్నకు తొలి ఆరు రోజు ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ కలెక్షన్లు సమాధానమిచ్చాయి.
సినీ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకారం.. తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ.. మహేష్ బాబు గుంటూరు కారం కంటే వరుసగా ఐదో రోజు కూడా ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం కలెక్షన్లు కూడా మహేష్ మూవీని మించే అవకాశాలు ఉన్నాయి.
హనుమాన్ vs గుంటూరు కారం
హనుమాన్, గుంటూరు కారం తొలి రోజు రోజుల కలెక్షన్లను రోజువారీగా గురువారం (జనవరి 18) మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశాడు. అతని ప్రకారం.. ఆరో రోజు గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రూ.9.65 కోట్ల గ్రాస్ బిజినెస్ చేయగా.. హనుమాన్ రూ.15.4 కోట్లు వసూలు చేసింది. అంటే గుంటూరు కారం కంటే రూ.5.75 కోట్లు ఎక్కువ వసూలు చేసింది.
ఐదో రోజు గుంటూరు కారం రూ.13.92 కోట్లు, హనుమన్ రూ.19.57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 4, 3, 2 రోజుల్లో గుంటూరు కారం వరుసగా రూ.21.14 కోట్లు, రూ.22.36 కోట్లు, రూ.24.59 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ నాలుగో రోజు రూ.25.63 కోట్లు, మూడో రోజు రూ.24.16 కోట్లు, రెండో రోజు రూ.29.72 కోట్లు వసూలు చేసింది.
తొలి రోజు మాత్రమే హనుమాన్ కంటే గుంటూరు కారం కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు వరుసగా ఐదు రోజుల పాటు హనుమానే పైచేయి సాధించింది. తొలి రోజు చూస్తే గుంటూరు కారంపై ఉన్న హైప్ తో గత శుక్రవారం ఆ సినిమా ఏకంగా రూ.82.08 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ సాధించగా, హనుమాన్ మాత్రం రూ.21.35 కోట్లు రాబట్టింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం రూ.175 కోట్ల మార్కుకు చేరువలో ఉందని మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. రూ.200 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తోంది. ఇక హనుమాన్ విషయానికి వస్తే ఆ సినిమా ఆరు రోజులు కలిపి రూ.135.83 కోట్లు సాధించింది. ఇక ఈ మూవీ రూ.150 కోట్ల క్లబ్ లో చేరబోతోందని అతడు చెప్పాడు.
హనుమాన్ మూవీ గురించి..
ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఓ యువకుడు (తేజ సజ్జా) హనుమంతుడి వల్ల సూపర్ పవర్స్ పొంది చెడుతో పోరాడుతాడు. ఈ చిత్రంలో తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్ తదితరులు నటించారు. ఈ చిత్రం గురించి తేజ సజ్జా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఒక సూపర్ హీరో సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎగ్జైటింగ్ గా అనిపించిందని అన్నాడు. ఈ చిత్రంలో పిల్లల వినోదం కోసం సూపర్ హీరో యాక్షన్ సీక్వెన్స్ లు, బోలెడంత కామెడీ ఉంటుందని అన్నారు.
గుంటూరు కారం మూవీ గురించి..
గుంటూరు కారంలో మహేష్ బాబు, శ్రీలీల నటించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయినా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా లేకపోవడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.