Hanuman Story: హనుమాన్ స్టోరీ ఇదీ.. ఇక పుకార్లు ఆపండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Hanuman Story: తేజ సజ్జ లీడ్ రోల్‌లో నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా స్టోరీ, తేజ క్యారెక్టర్ గురించి వస్తున్న పుకార్లకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
Hanuman Story: ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వస్తోంది తేజ సజ్జ నటించిన హనుమాన్. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చూసి సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇందులో తేజనే హనుమాన్ అని, ఇదొక 3డీ మూవీ అని, రామాయణంలో ఒక భాగమని.. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి.
దీంతో వీటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు వీటిపై స్పందించాడు. “సినిమాపై వస్తున్న పుకార్లకు తెరదించాలని అనుకుంటున్నాను. ఇందులో తేజ ఓ సాధారణ వ్యక్తే. అతనికి హనుమాన్ సూపర్ పవర్స్ వస్తాయి. ఆ శక్తితో అతడు అంజనాద్రి అనే గ్రామంతోపాటు విలన్ల బారి నుంచి ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడన్నదే స్టోరీ” అని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
తన సూపర్ హీరో స్టోరీలన్నింటిలోనూ ఓ దేవుడి ప్రస్తావన ఉంటుందని కూడా స్పష్టం చేశాడు. “ఇలాగే నా ప్రతి సూపర్ హీరో స్టోరీల్లో ఓ దేవుడి ప్రస్తావన ఉంటుంది. ఇందులో తర్వాత అధీర రానుంది. ప్రస్తుతం ఈ మూవీ పనులు జరుగుతున్నాయి. మూడో సినిమా హీరోయిన్ ప్రధాన పాత్రగా ఉంటుంది” అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
ఇలా దేవుడి పాత్రలే సూపర్ హీరోలుగా మొత్తం 12 సినిమాలను అతడు ప్లాన్ చేయడం విశేషం. ఆ సినిమాలన్నీ తెరకెక్కాలంటే మాత్రం హనుమాన్ మూవీ సక్సెస్ సాధించడం చాలా అవసరం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
జనవరి 12న హనుమాన్ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి అదే రోజు రిలీజ్ అవుతున్న గుంటూరు కారం నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. తేజ సజ్జతోపాటు ఇందులో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.