HanuMan OTT Record: ఓటీటీలోనూ రికార్డులను బద్దలుకొడుతున్న హనుమాన్.. 11 గంటల్లోనే..
HanuMan OTT Streaming Record: హనుమాన్ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్‍లోనూ దూసుకెళుతోంది. తొలి 11 గంటల్లోగానే ఓ మైలురాయిని ఈ చిత్రం దాటేసింది.
HanuMan OTT Record: ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హనుమాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఆదివారం (మార్చి 17) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జియోసినిమాలో హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన ఒక రోజు తర్వాత.. ఈ మూవీ తెలుగులో జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రికార్డులను సృష్టించిన హనుమాన్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
11 గంటల్లోనే 102 మిలియన్లను దాటేసి..
హనుమాన్ సినిమా జీ5 ఓటీటీలో తెలుగులో మాత్రమే మార్చి 17 ఉదయం అందుబాటులోకి వచ్చింది. అది కూడా తేదీ గురించి ముందస్తుగా ప్రకటన లేకుండా సడెన్‍గా అడుగుపెట్టింది. అయినా.. హనుమాన్ మూవీకి అదిరిపోయే వ్యూవర్‌షిప్ దక్కుతోంది. తొలి 11 గంటల్లోనే హనుమాన్ సినిమా 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటిందని జీ5 ఓటీటీ నేడు (మార్చి 18) అధికారికంగా ప్రకటించింది.
గ్లోబల్‍గా హనుమాన్ టాప్-1లో ట్రెండ్ అవుతోందని జీ5 ఓటీటీ వెల్లడించింది. 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును అధిగమించి రికార్డులను బద్దలుకొట్టిందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. హృదయాలను గెలుస్తూ.. రికార్డులను బద్దలుకొడుతోందని నేడు పోస్ట్ చేసింది.
తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చి ఇంత వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను హనుమాన్ దాటడం విశేషంగా ఉంది. త్వరలోనే జీ5 ఓటీటీలో కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. మరోవైపు, జియో సినిమా ఓటీటీలో హనుమాన్ హిందీ వెర్షన్‍కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
టాలీవుడ్‍లో రికార్డ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా హనుమాన్ తెరకెక్కింది. సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతికి రిలీజై అత్యధిక కలెక్షన్లను సాధించిన తెలుగు చిత్రంగా టాలీవుడ్‍లో రికార్డును ఈ మూవీ సృష్టించింది. జనవరి 12వ తేదీన రిలీజైన హనుమాన్ తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ కలెక్షను దక్కించుకుంది.
హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించారు. హనుమంతుడి రక్తపు బొట్టు నుంచి ఉద్భవించిన రుధిరమణితో అతీత శక్తులు పొందే యువకుడు హనుమంతు పాత్రను తేజ చేశారు. ఆ మణిని దక్కించుకునేందుకు వచ్చే మేకేల్‍ను అతడు ఎలా నిలువరించాడనే అంశం ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. ఈ సినిమాలో హనుమంతుడిని చూపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా అదిరిపోయాయి.
హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి గౌరహరి సంగీతం అందించారు. థియేటర్లలో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల నిరీక్షణ తర్వాత ఈ చిత్రం తెలుగులో జీ5, హిందీలో జియో సినిమా ఓటీటీల్లో అడుగుపెట్టింది.