HanuMan OTT: ఓటీటీలో కొనసాగుతున్న హనుమాన్ హోరూ.. ‘200’ మార్క్ కూడా దాటేసి..
HanuMan Movie OTT: హనుమాన్ సినిమా ఓటీటీలోనూ సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రానికి భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. తాజాగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ కూడా దాటేసింది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
HanuMan OTT Streaming: హనుమాన్ సినిమా ఓటీటీలోనూ జోరు భారీగా చూపిస్తోంది. థియేటర్లలో బంపర్ హిట్ అయిన ఈ సూపర్ హీరో సినిమా.. ఓటీటీలోనూ దూసుకెళుతోంది. సుమారు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ హనుమాన్ మూవీ ఓటీటీలో తాజాగా మరో మైలురాయి దాటింది.
హనుమాన్ సినిమా మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వచ్చేయటంతో ప్రేక్షకుల నుంచి భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ఓటీటీలో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది హనుమాన్ చిత్రం.
200 మిలియన్ క్రాస్ చేసి..
హనుమాన్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 207 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ ఈ ఘనత సాధించినట్టు జీ5 వెల్లడించింది. హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతోందని ట్వీట్ చేసింది. 5 రోజుల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందంటే.. హనుమాన్ హవా ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
హిందీలోనూ టాప్‍లో ట్రెండింగ్
హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ మార్చి 16వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. ఆ ప్లాట్‍ఫామ్‍లో కూడా అప్పటి నుంచి టాప్‍లోనే ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. హిందీ వెర్షన్‍కు కూడా భారీ స్థాయిలో వ్యూస్ దక్కుతున్నాయి.
ఆ వెర్షన్‍ల కోసం డిమాండ్లు
హనుమాన్ సినిమాను జీ5 ఓటీటీ తెలుగులో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. అయితే, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో ఇంకా స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. దీంతో ఆ వెర్షన్‍లో త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
హనుమాన్ మూవీ కలెక్షన్లు
హనుమాన్ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.40 కోట్లతో రూపొందిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లు సాధించింది. భారత్‍తో పాటు ఓవర్సీస్ మార్కెట్‍లోనూ ఆశ్చర్యపోయేలా కలెక్షన్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతికి రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ మూవీగా రికార్డు దక్కించుకుంది.
హనుమాన్ గురించి..
హనుమాన్ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్‍గా చేశారు. మైకేల్ అనే విలన్ పాత్రలో వినయ్ రాయ్ నటించారు. సముద్రఖని, రాధికా శరత్‍కుమార్, వెన్నెల కిశోర్ కూడా కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రం లాంగ్ రన్ సాధించి 50 రోజుల ఫంక్షన్ కూడా జరుపుకుంది. హనుమాన్‍కు సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ సినిమా కూడా రానుంది.