HanuMan Movie: కేంద్ర మంత్రి అమిత్‍షాను కలిసిన హనుమాన్ టీమ్
HanuMan Movie - Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హనుమాన్ మూవీ టీమ్ కలిసింది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
HanuMan Movie: సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’ తెలుగుతో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లపై పైగా వసూళ్లను సాధించి, సెన్సేషనల్ విజయం సాధించింది. నార్త్‌లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లను దక్కించుకుంది. హనుమాన్ మూవీతో హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఈ చిత్రానికి అన్ని చోట్ల ప్రశంసలు దక్కాయి. కాగా, హనుమాన్ టీమ్ సభ్యులు నేడు (మార్చి 12) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాను హనుమాన్ టీమ్ హైదరాబాద్‍లో కలిసింది. ఈ మూవీ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. షాతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. తాము కేంద్ర మంత్రులను కలిసి విషయాన్ని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.
తమకు ప్రోత్సాహం కలిగేలా మాట్లాడిన అమిత్ షాకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. “గౌరవనీయులైన హోం శాఖ మంత్రి అమిత్ షాను, కిషన్ రెడ్డిని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. హనుమాన్ సినిమా గురించి ప్రోత్సాహకరమైన మాటలను చెప్పినందుకు ధన్యవాదాలు అమిత్ జీ. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది” అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. అమిత్ షాకు హనుమంతుడి విగ్రహంతో ఉన్న మొమెంటోను అందించారు.
హనుమాన్ సినిమా ఓటీటీ
హనుమాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మార్చి 8న ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందనే అంచనాలు వచ్చాయి. అయితే, ఆరోజున స్ట్రీమింగ్‍కు రాలేదు. జీ5 వాయిదా వేసింది. అయితే, హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై త్వరలోనే ప్రకటన వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ సోమవారం (మార్చి 11) ట్వీట్ చేశారు. దీంతో ఈవారంలోనే హనుమాన్ జీ5 ఓటీటీలోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
హిందీ వెర్షన్ స్ట్రీమింగ్
హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా హిందీలో జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు కలర్స్ సినీ ప్లెక్స్ టీవీ ఛానెల్‍లో ఈ మూవీ హిందీ వెర్షన్ టెలికాస్ట్ కానుంది.
అయితే, హనుమాన్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. ఆ ఓటీటీ కూడా మార్చి 16నే స్ట్రీమింగ్‍కు తెస్తుందని రూమర్లు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హనుమాన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మపై భారీగా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. హనుమంతుడి నుంచి ఉద్భవించిన మణి వల్ల అతీత శక్తులు పొందే యువకుడు హనుమంతుగా ఈ చిత్రంలో నటించారు తేజ. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ కూడా రానుంది.
టాపిక్