Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్లో నటించే అవకాశం!
Prasanth Varma PVCU Offer: హనుమాన్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో చేరేందుకు ఆఫర్ కాల్ ప్రకటించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Prasanth Varma PVCU Offer: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన విషయం తెలిసిందే. తర్వాత దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు.
హనుమాన్ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో అతని నెక్ట్స్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాలు, ప్లాన్స్ రివిల్ చేశారు. తన నెక్ట్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.
తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో (Prasanth Varma Cinematic Universe) చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశంగా మారింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక నోట్ ని రాసుకొచ్చారు. "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్. సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేకమైన నైపుణ్యం ఏమిటి? అది కథలు రూపొందించే నేర్పా, ఎడిటింగ్, గ్రాఫిక్స్‌తో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం ఉందా. గొప్పగా మార్కెటింగ్ చేయగలరా. మీ కళాత్మక నైపుణ్యాలతో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఉందా?" అంటూ ప్రశాంత్ వర్మ అడిగాడు.
"మీకున్న అతిగొప్ప కళాత్మక నైపుణ్యాలు ఏంటో చెప్పండి. మనం కలిసి కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. మీ పోర్ట్‌ఫోలియోలను "talent@thepvcu.com" ద్వారా తెలియజేయండి. మిమ్మల్ని పీవీసీయూలో కలుస్తాను" అని ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మీకు నటన, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఇలా ఏదైన రంగంలో ఇంట్రెస్ట్, టాలెంట్ ఉంటే ఆ వివరాలను తాను చెప్పిన మెయిల్‌కు సెండ్ చేయమని, దాని ద్వారా పీవీసీయూలో అవకాశం పొందవచ్చని ప్రశాంత్ వర్మ నోట్ చెబుతుంది. మంచి నటన చూపించినవాళ్లు జై హనుమాన్లో నటించే అవకాశం కూడా పొందవచ్చు. లేదా ఇతర క్రాఫ్ట్‌లో పని చేసే ఛాన్స్ అయినా పొందొచ్చు. ఇలా ప్రేక్షకులకు ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ప్రశాంత్ వర్మ తన PVCU ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి యూనివర్స్ బిగినింగ్‌కి ముందే చెప్పిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫోర్స్‌ని నిర్మించాలని ప్రశాంత్ వర్మ సంకల్పించారు. ఈ క్రమంలోనే ఇలా నోట్ విడుదల చేశారు. PVCU నుండి వచ్చే సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌లు ముందు ముందు రానున్నట్లు తెలుస్తోంది.
కాగా హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎంత పెద్ద విజయం అందుకున్నాడో తెలిసిందే. ఇందులో తేజ సజ్జా మెయిన్ హీరోగా నటించగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా అలరించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోకు అక్కగా కీలక పాత్ర చేసింది. ఇప్పుడు ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవడమే కాకుండా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటోంది.