Hanuman day 6 Box Office Collections: హనుమాన్ కలెక్షన్స్.. ఇండియాలో రూ.80 కోట్లు దాటేసిన మూవీ
Hanuman day 6 Box Office Collections: తేజ సజ్జా నటించిన ఈ చిత్రం బుధవారం రూ.11.5 వసూలు చేసింది. ఇది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలైన రోజే విడుదలైంది.
Hanuman day 6 Box Office Collections: తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ శుక్రవారం (జనవరి 12) థియేటర్లలో విడుదలైంది. Sacnilk.com రిపోర్ట్ ప్రకారం హనుమన్ ఇప్పటి వరకు ఇండియాలో రూ.80.46 కోట్లు వసూలు చేయడం విశేషం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంతో బాక్సాఫీస్ క్లాష్ ఉన్నప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
హనుమాన్ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికితోడు గుంటూరు కారం మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడం, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలాంటివి కూడా హనుమాన్ మూవీకి కలిసి వచ్చాయి. దీంతో తొలి వారంలో అంచనాలకు మించి ఈ సినిమా వసూళ్లు చేసింది. నార్త్ లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్
Sacnilk.com పోర్టల్ ప్రకారం తేజ సజ్జా నటించిన హనుమాన్ బుధవారం(జనవరి 17) అన్ని భాషల్లో కలిపి ఇండియాలో సుమారు రూ.11.5 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. గత గురువారం(జనవరి 11) పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.4.15 కోట్లు రాబట్టిన ఈ సూపర్ హీరో చిత్రం.. శుక్రవారం తొలి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.8.05 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత హనుమాన్ మూవీ రెండో రోజు అన్ని భాషల్లో కలిపి రూ.12.45 కోట్లు రాబట్టగా, మూడో రోజైన ఆదివారం రూ.16 కోట్లు రాబట్టింది. తొలి వీకెండ్ తర్వాత కాస్త నెమ్మదించిన ఈ చిత్రం.. సోమవారం (జనవరి 15) భారత్ లో రూ.15.2 కోట్లు, మంగళవారం (జనవరి 16) రూ.13.11 కోట్లు రాబట్టింది.
హనుమాన్ ఎలా ఉందంటే?
హనుమాన్ ఓ సూపర్ హీరోకు చెందిన సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో ఓ యువకుడు (తేజ సజ్జా) హనుమంతుడి వల్ల సూపర్ పవర్స్ పొంది తన ప్రజల కోసం పోరాడుతాడు. ఈ చిత్రంలో తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్ తదితరులు నటించారు.
ఈ సినిమా గురించి తేజ సజ్జా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఒక సూపర్ హీరో సినిమా చేయాలనే ఆలోచన తనకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని చెప్పాడు. ''ఈ సినిమాలో పిల్లల వినోదం కోసం సూపర్ హీరో యాక్షన్ సీక్వెన్స్ లు, బోలెడంత కామెడీ ఉంటుంది. అదే సమయంలో మన చరిత్ర కూడా సూపర్ హీరో ఎలిమెంట్ తో ముడిపడి ఉంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో మన దేశ ఇతిహాసాన్ని మేళవించే ప్రయత్నం చేశాం.. కాబట్టి ఇది చాలా ఎంటర్ టైనింగ్ మూవీ'' అని తేజ సజ్జ అన్నాడు.
ఈ హనుమాన్ మూవీ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు మన దేవుళ్లే సూపర్ హీరోలుగా 12 సినిమాలు చేయాలని సంకల్పించాడు. మరి అందులో ఎన్ని సినిమాలు సాధ్యమవుతాయో చూడాలి.