హన్సిక హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ గార్డియన్ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. గార్డియన్ సినిమాను డైరెక్టర్ విజయ్‌చందర్ నిర్మించాడు. ఈ మూవీలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.
తమిళంలో గత ఏడాది థియేటర్లలో రిలీజైన గార్డియన్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కోటి లోపే వసూళ్లను దక్కించుకున్నది. కాన్సెప్ట్, డైరెక్టర్ టేకింగ్, వీఎఫ్ఎక్స్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. తనకు జరిగిన అన్యాయంపై హీరోయిన్ సాయంతో ఓ అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. గార్డియన్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.
అపర్ణను (హన్సిక) చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంటుంది.అందరూ ఆమెను అన్‌లక్కీ అపర్ణ అని పిలుస్తుంటారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వస్తుంది అపర్ణ. అక్కడ ఆమెకు క్రిస్టల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్పటి నుంచి అపర్ణ జీవితమే మారిపోతుంది. కే అనే పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ వస్తుంది.
అపర్ణకు దూరమైన లవర్ ప్రభ కూడా మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. అభిప్రాయభేదాలు తొలగిపోయి ఇద్దరు ఒక్కటవుతారు. ఆఫీస్‌లో తన కారణంగా అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు. వారిద్దరు చనిపోతే బాగుండునని అపర్ణ కోరుకుంటుంది.
తమ ఆఫీస్ ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడు చనిపోవాలని అపర్ణ కోరుకుంటుంది. ఆమె కళ్ల ముందే ఇద్దరు చనిపోతారు. ఆపర్ణ మనసులోని కోరికలు ఎలా నెరవేరుతున్నాయి? అపర్ణకు దొరికిన క్రిస్టల్‌లో బంధించబడిన మీరా అనే ఆత్మ ఎవరు? మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నదే గార్డియన్ మూవీ కథ.
వరుస పరాజయాల కారణంగా కొన్నాళ్లుగా అవకాశాల రేసులో వెనుకబడిపోయింది హన్సిక. గార్డియన్ రిలీజై ఏడాది దాటినా ఆమెకు మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే మూవీ చేసింది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా చేసిన ఈ మూవీ ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.
ప్రస్తుతం ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఢీ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది హన్సిక. నషా పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.
సంబంధిత కథనం