Guppedantha Manasu September 29th Episode: జగతి కండీషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెప్పడంతో రిషి, మహేంద్ర ఎమోషనల్ అవుతారు. తల్లి బతకాలని రిషి పదే పదే కోరుకుంటాడు. రిషి, మహేంద్ర కోసం వసుధార తండ్రి భోజనం తీసుకొస్తాడు. కానీ తమకు ఆకలిగా లేదని భోజనం చేయడానికి ఇద్దరు తిరస్కరిస్తారు. ముద్ద నోట్లో పెట్టుకున్న రుచించదు అని మహేంద్ర అంటాడు. మీరు భోజనం చేయకపోతే రిషి తినడని మహేంద్రను బతిమిలాడుతుంది వసుధార. తండ్రి చెప్పడంతో చివరకు భోజనం చేయడానికి రిషి అంగీకరిస్తాడు.
జగతి దగ్గర తాను ఉంటానని అంటాడు చక్రపాణి. జగతి కండీషన్ చూసి చక్రపాణి బాధపడతాడు ఈ రోజు కాపాడింది మీ కొడుకు ప్రాణమే కాదు నా బిడ్డను కూడా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. రిషి అంటే వసుధారకు ప్రాణం...ఈ రోజు మీరు ఆ ప్రాణాన్ని నిలబెట్టారని అంటాడు. ఖచ్చితంగా మీరు కోలుకుంటారని జగతితో అంటాడు. ప్లేట్‌లో అన్నం పెట్టుకున్నా కూడా తల్లి గురించే ఆలోచిస్తుంటాడు రిషి. మనసులో ఉన్న బాధను దించుకొని కడుపు నింపుకోవాలంటే కష్టంగా ఉందని మహేంద్ర బాధపడతాడు. దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు, ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరూ ఏం చేయలేరని వసుధార అతడిని ఓదార్చుతుంది.
రిషికి పొలమారడంతో వసుధార నీళ్లు తాగిస్తుంది. తాను భోజనం ముగించిన తర్వాత వసుధారను తినమని అంటాడు రిషి. కానీ తనకు ఆకలిగా లేదని, ఇప్పుడు భోజనం చేయలేనని అంటుంది వసుధార. ఎదుటివాళ్ల ఆకలి తీర్చడమే కాదు నీ ఆకలి తీర్చుకోవడం కూడా తెలుసుకో. ఆకలికి నేనే కాదు నువ్వు కూడా తట్టుకోలేవని వసుధారతో అంటాడు రిషి. తానే స్వయంగా వసుధారకు భోజనం వడ్డించి ప్లేట్‌ను ఆమెకు అందిస్తాడు రిషి. జగతి మనసును బాధపెట్టినందుకు వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు నాకు దూరమయ్యారని ఆమెను తాను దూరం పెట్టానని వాపోతుంది.
హాస్పిటల్ బెడ్‌పై తల్లి ప్రాణాలతో పోరాడటం చూసి రిషి ఎమోషనల్ అవుతాడు. జగతి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమెకు సారీ చెబుతాడు. తాను బతికినంత కాలం చివరి శ్వాస ఉన్నంత వరకు అమ్మ అని పిలుస్తానని, ఒక్కసారి కళ్లు తెరవమని కన్నీళ్లతో ప్రాధేయపడతాడు. ఒక్కసారి కళ్లు తెరవమని వేడుకుంటాడు. నువ్వు త్వరగా కోలుకుంటే..నిన్ను గుండెలకు హత్తుకొని ఏడవాలని అనిపిస్తుందని అంటాడు.
ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అని అంటారు...ఇన్నాళ్లు నీలాంటి గొప్ప తల్లి ప్రేమను పొందినందుకు నేను చాలా అదృష్టవంతుడినని తల్లితో చెబుతాడు రిషి. కానీ ఆ ప్రేమను నీకు తిరిగి ఇవ్వలేకపోయానని చెప్పి ఆమెకు క్షమాపణలు చెబుతాడు. ఇన్నాళ్లు నీ మాట వినడానికి ఇష్టంపడలేదని, ఇప్పుడు వినడానికి వచ్చినప్పుడు ఇలా మౌనంగా ఉంటావేమిటని కన్నీళ్ల పెట్టుకుంటాడు. కళ్లు తెరిచి మాట్లాడమని అంటాడు.
డాక్టర్ వచ్చి జగతికి మీరు ఏమవుతారని అడుగుతాడు. ఆవిడ మా అమ్మ అంటూ రిషి అతడికి సమాధానం చెబతాడు. బుల్లెట్ హార్ట్‌కు టచ్ అయి ఉండటం వల్ల జగతి కండీషన్ ఇంకా క్రిటికల్‌గానే ఉందని, ఆమెను బతికించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని అంటాడు. డాక్టర్లు వెళ్లిపోగానే నువ్వు త్వరగా కోలుకుంటే గానీ నా గుండె స్థిమితంగా ఉండదని తల్లితో అంటాడు రిషి. నువ్వు కోలుకోవాలంటే నేను చేయాలో చెప్పు. ఏదైనా చేస్తానని తల్లికి మాటిస్తాడు రిషి.
తల్లి కోసం రిషి పడుతోన్న ఆవేదన చూసి మహేంద్ర, వసుధార కూడా ఎమోషనల్ అవుతారు. ఈ క్షణాల కోసం జగతి ఎంతో తపించిపోయిందని, రిషి ప్రేమ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిందని అంటాడు. రిషి తన పక్కన అప్యాయంగా కూర్చోవాలని అనుకుందని. కానీ చివరకు ఇలాంటి పరిస్థితుల్లో రిషి ప్రేమను పొందుతుందని అనుకోలేకపోయిందని మహేంద్ర బాధపడతాడు. శైలేంద్ర వల్లే ఇదంతా జరిగిందని కోపంతో రగిలిపోతాడు. శైలేంద్ర ఈ సారి తప్పించుకోలేడని, పోలీసులకు అన్ని ఆధారాల్ని సేకరించాడని వసుధార అంటుంది. అతడు పట్టుపడటం ఖాయమని చెబుతుంది. మహేంద్ర, వసుధార వచ్చి రిషిని ఓదార్చుతారు.
ముగ్గురు కలిసి రూమ్ నుంచి బయటకు వెళ్లబోతుండగా జగతి స్పృహలోకి వస్తుంది. కళ్లు తెరిచి రిషిని పిలుస్తుంది. అది చూసి రిషి సంతోషంగా అమ్మ అంటూ జగతిని పిలుస్తాడు. ఆ పిలుపుతో జగతి ఉద్వేగానికి లోనవుతుంది. నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా...మళ్లీ ఒకసారి పిలవమని అంటుంది. రిషి అలాగే పిలుస్తాడు. నా జీవితానికి ఈ ఒక్క పిలుపు చాలని జగతి ఆనందపడుతుంది.
నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడని భర్తతో ఆనందంగా చెబుతుంది జగతి. అంత ద్వేషించినా నీ ప్రాణాలను అడ్డువేసి నా ప్రాణాలను కాపాడావని, నీ కోసం ఏదైనా చేస్తానని మరోసారి తల్లికి మాటిస్తాడు రిషి. తన దగ్గర ఉన్న తాళి బొట్టు ను రిషికి చూపించి...వసుధారను, నిన్ను భార్యాభర్తలుగా చూడాలని ఉందని, ఈ నల్లపూసలను నువ్వు వసు మెడలో వేయాలని తాను ఆశపడుతున్నట్లు చెబుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.