Guppedantha Manasu Serial: రాజీవ్‌ను మను నిజంగానే చంపాడని, నీ కొడుకు ఓ హంతకుడు అంటూ అనుపమ మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుంది దేవయాని. వసుధారపై మనసు పడ్డ మను ఆమె కోసమే రాజీవ్‌ను చంపి ఉంటాడని ఎగతాళిగా మాట్లాడుతుంది. దేవయాని మాటలను సహించలేని అనుపమ ఆమెను కొట్టడానికి వస్తుంది. దేవయానిని అనుపమ కొట్టకుండా వసుధార అడ్డుకుంటుంది. దేవయానికి తానే బుద్దిచెబుతానని అంటుంది.
దేవయాని అనుపమతో మాట్లాడిన మాటల్ని మొబైల్‌లో రికార్డ్ చేస్తుంది వసుధార. ఈ వీడియోను ఫణీంద్రకు పంపిస్తుంది. ఆ వీడియో చూసి దేవయానిపై కోపంతో రగిలిపోతాడు ఫణీంద్ర. దేవయాని చేసిన తప్పుకు శైలేంద్ర చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు. తల్లి తప్పు చేస్తే తనకు శిక్ష పడటం చూసి శైలేంద్ర షాకవుతాడు. నన్ను ఎందుకు కొట్టారు అని తండ్రిని అడుగుతాడు. మీ అమ్మను కొట్టలేను కాబట్టి, ఆడవాళ్ల మీద చేయిచేసుకోవడం నాకు తెలియదు కాబట్టి నిన్ను కొట్టానని కొడుకుతో అంటాడు ఫణీంద్ర.
నువ్వు ఏది చేస్తే అది కరెక్ట్ అని మీ అమ్మ అంటుంది. మీ అమ్మ ఏది చేస్తే అదే కరెక్ట్ అని నువ్వు అంటావు. తల్లికి తగ్గ కొడుకు..కొడుకుకు తగ్గ తల్లి అంటూ ఇద్దరికి క్లాస్ ఇస్తాడు ఫణీంద్ర. మీకు తప్పొప్పులు తెలియవు. కనీసం ఎదుటివాళ్లు చెబితే అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. నేను కోపంగా ఏదైనా చెబితే మారిపోయినట్లు నటిస్తారు. ఆ తర్వాత మీకు మీరే చర్చించుకొని మీకు నచ్చింది చేస్తారని ఇద్దరిపై కోపగించుకుంటాడు. ఇంకోసారి కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోనని దేవయానికి వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర.
పోలీస్ స్టేషన్‌లో సెల్‌లో ఉన్న మను దగ్గరకు టీ బాయ్‌గా మారువేషంలో రాజీవ్ వస్తాడు. రాజీవ్‌ను చూసి మను షాకవుతాడు. రాజీవ్‌ను గుర్తుపట్టి పోలీసులకు చెబుతాడు. రాజీవ్‌ను పోలీసులు చూసే లోపు అతడు స్టేషన్ బయటకు వెళతాడు. రాజీవ్ వచ్చాడని మను చెప్పిన మాటలను పోలీసులు నమ్మరు. చనిపోయిన రాజీవ్ ఎలా తిరిగొస్తాడని అంటారు. మహేంద్ర, వసుధార మాత్రం మను మాటలను నమ్ముతారు. కేసును తప్పుదోవ పట్టించడానికే మను ఇలా అబద్దాలు ఆడుతున్నాడని పోలీస్ ఆఫీసర్ అంటాడు. నువ్వే రాజీవ్‌ను హత్య చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, నేరాన్ని ఒప్పుకోవడం మినహా నీకు మరో దారి లేదని అంటాడు. తాను మాత్రం రాజీవ్‌ను కళ్లారా చూశానని మను గట్టిగా వాదిస్తాడు.
రాజీవ్‌ను నిజంగానే మీరు హత్య చేశారా మనును అడుగుతుంది వసుధార. రాజీవ్‌బతికే ఉన్నాడని, అలాంటప్పుడు తాను నేరం చేసినట్లు ఎలా అవుతుందని మను ఆమెతో వాదిస్తాడు. వసుధార మాటల్ని మధ్యలోనే మహేంద్ర అడ్డుకుంటాడు. మను తప్పు చేయలేదని తాను నిరూపిస్తానని అంటాడు.
మనుకు టీ ఇచ్చిన అతడిని పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తీసుకొస్తారు. కానీ రాజీవ్ కాకుండా మరొకతను అక్కడ ఉంటాడు. తానే మనుకు టీ ఇవ్వడానికి వచ్చానని ఆ వ్యక్తి అబద్ధం ఆడుతాడు. ఆ వ్యక్తి చెప్పిందే నిజమని మనునే అబద్ధాలు ఆడుతున్నాడని పోలీసులు మనుపై ఫైర్ అవుతారు.
మనును తెలివిగా రాజీవ్ మర్డర్ కేసులో శైలేంద్రనే ఇరికించి ఉంటాడని మహేంద్ర అనుమానపడతాడు. రాజీవ్ చనిపోయాడంటే వసుధార నమ్మదు. అతడు బతికే ఉండి ఈ నాటకం ఆడుతున్నాడని అనుకుంటుంది. రాజీవ్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తేనే మను నిర్ధోషిగా ఈ కేసు నుంచి బయటపడతాడని మహేంద్రతో అంటుంది వసుధార.
అప్పుడే రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. తాను బతికే ఉన్నానని చెబుతాడు. రాజీవ్‌ను బెదిరించడానికి మను రెండు బుల్లెట్స్ కాలుస్తాడు. ఆ బుల్లెట్స్‌ను అడ్డుపెట్టుకొని తాను చనిపోయినట్లు రాజీవ్ డ్రామా ఆడుతాడు. డెడ్‌బాడీని మనునే మాయం చేశాడని శైలేంద్రతో కలిసి పోలీసులతో పాటు అందరిని నమ్మిస్తాడు రాజీవ్. సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు ఆధారాలను మను వ్యతిరేకంగా క్రియేట్ చేస్తారు రాజీవ్, శైలేంద్ర.