Guppedantha Manasu Serial: తన తండ్రిని వెతికితీసుకురమ్మని మహేంద్రను అడుగుతాడు మను. తండ్రిని తీసుకొచ్చి తన ముందు నిలబెడతానని ప్రామిస్ చేయమని కోరుతాడు. మను కోరినట్లే మాటిస్తాడు మహేంద్ర. నీ తండ్రిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానని ప్రామిస్ చేస్తాడు.
అనుపమ చెప్పకపోయినా నీ తండ్రి లోకంలో ఎక్కడున్నా కనిపెట్టి నీ ముందు నిలబెడతానని మనుతో అంటాడు మహేంద్ర. ఇప్పటివరకు చరిత్రలో లవర్స్‌ను కలిపిన గొప్ప కథలు విని ఉంటావు. కానీ తండ్రీకొడుకులను కలిపిన గొప్ప కథను నేను నీకు చూపించబోతున్నానని మనుకు మాటిస్తాడు మహేంద్ర.
మహేంద్ర ఇచ్చిన మాటతో మను సంతోషపడతాడు. మనుకు మహేంద్ర మాటివ్వడం చూసి వసుధార, అనుపమ కంగారు పడతారు. తెలిసి చేశారో..తెలియక చేశారో కానీ...మహేంద్ర తన గురించి తానే వెతుక్కునేలా మాట ఇచ్చి ఇరుక్కుపోయారని వసుధార అంటుంది.
మావయ్యకు తానే మను తండ్రిని అని తెలిస్తే అతడు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావడం లేదని అనుపమతో చెబుతుంది వసుధార. తండ్రి గురించి అన్ని నిజాలు మనుకు చెబితేనే గొడవలు సమసిపోతాయని అనుపమతో వసుధార అంటుంది. కానీ నిజం చెప్పడానికి ఒప్పుకోదు అనుపమ.
మనుకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోమని మహేంద్రను కోరుతుంది అనుపమ. తన తండ్రి ఎవరు అనే నిజం తెలిస్తే మను ఆవేశంలో అతడికి ఆపదను తలపెట్టి మళ్లీ జైలుకు వెళతాడని, నీ క్షేమం కోరి చెబుతున్నానని మహేంద్రతో అంటుంది అనుపమ. తన క్షేమం అని అనుపమ ఎందుకు అన్నదో మహేంద్రకు అర్థం కాదు.
ఆ మాట ఎందుకు అన్నావని అనుపమను అడుగుతాడు. అనుపమ తడబడిపోయి అందరి క్షేమం అని మాట మారుస్తుంది. అనుపమ, వసుధార ఎంత చెప్పిన మహేంద్ర మాత్రం తన ప్రామిస్ వెనక్కితీసుకోడు. మను తండ్రి ఎక్కడున్నా వెతికి అతడి ముందు నిలబెడతానని ఖరాఖండిగా చెబతాడు.
వసుధార కాలేజీలో ఉండగా ఆమె దగ్గరకు ఏంజెల్ వస్తుంది. మీ కాలేజీలో ఓ జాబ్ కావాలని, కొన్నాళ్లు ఇక్కడ పనిచేయాలనుందని వసుధారను కోరుతుంది ఏంజెల్. మీకు సొంతంగా కాలేజీ ఉండగా...మా కాలేజీలో జాబ్ చేయడం ఏంటి అని ఏంజెల్‌ను అడుగుతుంది వసుధార.
కొన్ని సార్లు పరిస్థితులు అలా మారిపోతుంటాయంటూ అంటూ సమాధానం దాటేస్తుంది ఏంజెల్. మనును ప్రేమిస్తోన్న విషయం మాత్రం చెప్పదు. మీకు కాలేజీ ఉండగా నువ్వు, రిషి కూడా మా కాలేజీలో వర్క్ చేశారు నేను అలాగే మీ కాలేజీలో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.
ఏంజెల్‌కు సూటయ్యే జాబ్ కాలేజీలో కనిపించదు. ఏ జాబ్ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోమని ఏంజెల్‌తో అంటుంది వసుధార. తనకు మను క్యాబిన్‌కు ఎదురుగానో...పక్కనో క్యాబిన్ కావాలని వసుధారను కోరుతుంది ఏంజెల్. మనుపై తాను పగ పట్టానని, ఫోన్ చేస్తే మాట్లాడటం లేదని, కలుద్దామని అంటే ఒప్పుకోవడం లేదని, మను అంతు చూడాలనే మీ కాలేజీలో జాబ్ చేయాలని అనుకుంటున్నట్లు వసుధారతో చెబుతుంది ఏంజెల్.
మను క్యాబిన్ పక్కన కాకుండా అతడి క్యాబిన్‌లోనే మరో ఛైర్ వేసుకొని కూర్చోమని ఏంజెల్‌తో అంటుంది వసుధార. ఒకవేళ మను వచ్చి నిలదీస్తే ఎండీగా నేను పర్మిషన్ ఇచ్చానని అతడితో చెప్పమని ఏంజెల్‌కు చెబుతుంది. నిన్ను బయటకు పంపించకుండా నేను చూస్తానని, నీకు అండగా నేను ఉంటానని ఏంజెల్‌కు మాటిస్తుంది వసుధార.
మను కాలేజీలో అడుగుపెడతాడు. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా అంటూ పాట పాడుతూ మనును ఇరిటేట్ చేయాలని చూస్తాడు శైలేంద్ర. నా ప్రశ్నల గురించి, చిక్కుల గురించి నీకు ఎందుకు అని శైలేంద్రను అడుగుతాడు మను. నా తండ్రి ఎవరో తెలుసుకోవాలని నాకంటే నువ్వే ఎక్కువగా ఆత్రుతతో ఉన్నట్లు ఉన్నావని శైలేంద్రతో అంటాడు మను. నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని నా కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నానని శైలేంద్ర బదులిస్తాడు.
నా తండ్రి ఎవరో నువ్వే తెలుసుకో. నీకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్‌చేస్తానని శైలేంద్రకు ఆఫర్ ఇస్తాడు మను. ఇది మరో మోసంలా కనిపిస్తుందని, ఈ డీల్‌కు తాను ఒప్పుకోనని శైలేంద్ర అంటాడు. నువ్వు నాకు తెలియకుండానే చాలా సాయం చేస్తున్నావని, వెల్‌విషర్, గైడ్‌లా నాకు నిలబడుతున్నావని శైలేంద్రతో అంటాడు మను. నేను కేసు నుంచి బయటపడనని అనుకున్నా...కానీ నీ వల్ల బయటపడ్డానని శైలేంద్రతో చెబుతాడు మను
నా తండ్రి ఎవరో కనిపెడితే...ఎండీ పోస్ట్...కాలేజీ కాకుండా నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని శైలేంద్రతో చెబుతాడు మను. ఎండీ పోస్ట్‌కు నువ్వు అర్హుడివి కాదని, అందుకే నీకు ఆ పదవి దక్కడం లేదని శైలేంద్రకు క్లాస్ ఇస్తాడు మను. నీకు అర్హత, అదృష్టం లేని దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని టైమ్ వేస్ట్ చేసుకోకని, నీకు ఏదో కావాలో బాగా ఆలోచించి నాకు చెప్పమని శైలేంద్రతో అంటాడు మను.
తండ్రి గురించి తెలిస్తే నువ్వు ఏం చేస్తావని మనును అడుగుతాడు శైలేంద్ర. వాడికి నా చేతిలో భయంకరమైన చావు రాసిపెట్టి ఉందని మను అంటాడు. వీలైనంత తొందరగా నా తండ్రి ఎవరో కనిపెట్టమని శైలేంద్రతో అంటాడు మను.
మను తండ్రి ఎవరో కనిపెడితేనే తనకు లాభమని శైలేంద్ర నిర్ణయించుకుంటాడు. కోపంలో తండ్రిని చంపేసి మను జైలుకు వెళితే కాలేజీని దక్కించుకోవాలనే తన పని సులువు అవుతుందని శైలేంద్ర అనుకుంటాడు. ఇక నుంచి అదే పని మీద ఉండాలని ఫిక్సవుతాడు.
ఏంజెల్‌ను తన క్యాబిన్‌లో చూసి మను షాకవుతాడు. నువ్వు ఇక్కడున్నావేమిటి అని కోపంగా అడుగుతాడు. ఇక్కడికి ఎందుకొచ్చావని అంటాడు. నీ కోసం వచ్చానని ఏంజెల్ సమాధానం చెబుతుంది. నా క్యాబిన్‌లోకి రావోద్దని ఏంజెల్‌తో అంటాడు మను. నేను ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఇక్కడే ఉంటానని, ఈ కాలేజీలో ఉండటానికి పర్మిషన్ తీసుకున్నానని ఏంజెల్ అంటుంది.
నా క్యాబిన్‌లో నువ్వు ఉండటానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారని ఏంజెల్‌ను నిలదీస్తాడు మను. వసుధార అని ఏంజెల్ సమాధానం చెబుతుంది. వసుధార మాటను నువ్వు కాదనలేవు కాబట్టి నీ పని నువ్వు చూసుకో...నా పని నేను చేసుకుంటానని ఏంజెల్ అంటుంది.
. మను వర్క్ చేస్తుండగా అతడినే చూస్తూ సిగ్గుపడుతుంది ఏంజెల్ మను చూడగానే కన్నుకొడుతుంది. ఆమె చేసిన పనికి మను షాకవుతాడు. వారి గిల్లికజ్జాలను చాటు నుంచి వసుధార చూస్తుంది. మనును ఏంజెల్ ప్రేమిస్తుందని అర్థం చేసుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.