Guppedantha Manasu Today Episode: ఒక్కటైన తల్లీకొడుకులు - కాలేజీలో అడుగుపెట్టనన్న మను - దేవయాని దొంగదెబ్బ
Guppedantha Manasu Today Episode: మను, అనుపమలను కలిపేందుకు వసుధార, మహేంద్ర ప్లాన్ చేస్తారు. వారికి ఏంజెల్ సాయపడుతుంది. ఓ ప్లాన్ వేసి మను, అనుపమ పక్కపక్కనే కూర్చొని భోజనం చేసేలా చేస్తారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu Today Episode: మనును తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు మహేంద్ర. కానీ మనుతో కలిసి భోజనం చేయడానికి అనుపమ అంగీకరించదు. తాను భోజనం చేయనని, తనకు ఆకలిగా లేదని అబద్ధం ఆడుతుంది. నేను ఉన్నానని భోజనం చేయడానికి అనుపమ అంగీకరించడం లేదని, అక్కడి నుంచి వెళ్లిపోతానని మను అంటాడు.
కానీ అతడిని మహేంద్ర, వసుధార అతడిని ఆపేస్తారు. మను ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లెమా అని అనుపమను అడుగుతాడు మహేంద్ర. ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అంటూ తెలివిగా అనుపమను ఇరికించేస్తుంది వసుధార.
ఏంజెల్ ప్లాన్...
భోజనం చేసే టైమ్‌లో అనుపమకు ఎదురుగా కూర్చోవాలని అనుకుంటాడు మను. కానీ తెలివిగా అతడిని అనుపమ పక్క ఛైర్‌లో కూర్చొనేలా చేస్తుంది ఏంజెల్. కావాలనే ఏంజెల్ ఇదంతా చేస్తుందని తెలిసిన అనుపమ ఏం అనలేకపోతుంది. అనుపమ పక్కన కూర్చొని భోజనం చేయడానికి మను సంకోచిస్తాడు. కానీ అతడిని చేయి పట్టుకొని తీసుకొచ్చి అనుపమ పక్కన కూర్చబెడుతుంది ఏంజెల్. మను చేత అనుపమకు కర్రీ వడ్డించేలా చేస్తుంది వసుధార...
ఫెవరేట్ కర్రీస్...
నీ ఫేవరేట్ కర్రీస్ ఏమిటని మనును అడుగుతుంది ఏంజెల్. కానీ అతడి బదులుగా గుత్తివంకాయ, ఆలు ఫ్రై, పప్పు చారు మను ఫేవరేట్ కర్రీస్ అని అనుపమ సమాధానం ఇస్తుంది. నీకు ఇష్టమైన కర్రీస్ ఏమిటని అనుపమను ప్రశ్నిస్తుంది ఏంజెల్. కాకరకాయ ఫ్రై, బీరకాయ, పప్పుచారుతో పాటు అప్పడాలు అంటే అమ్మకు ఇష్టమని మను బదులిస్తాడు. మను, అనుపమ మధ్య దూరం తగ్గించి వారిని కలపాలనే తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో వసుధార, మహేంద్ర ఆనందం వ్యక్తం చేస్తారు.
అనుపమ ఎమోషనల్...
కొంతమందికి ఎవరు ఉండరు. ఎప్పుడు ఒంటరిగానే తింటారు. కొంతమందికి అందరూ ఉన్నా ఒంటరిగానే తినాల్సిన పరిస్థితి వస్తుందని మనుతో అంటాడు మహేంద్ర. అలాంటివాళ్ల బాధ మాటల్లో చెప్పలేమని మను బదులిస్తాడు. కొడుకు మాటలతో అనుపమ ఎమోషనల్ అవుతుంది. పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండవు. అవన్నీ సర్దుకునే రోజులు త్వరలోనే వస్తాయని మనుకు సర్ధిచెబుతాడు మహేంద్ర.
ఏంజెల్ సెల్ఫీ ....
అందరితో కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలని ఏంజెల్ సరదాపడుతుంది. కానీ అనుపమ వద్దని వారిస్తుంది. ఫొటో దిగడం తనకు ఇష్టం లేదని ఏంజెల్‌పై సీరియస్ అవుతుంది. మేడమ్‌కు ఇష్టం లేనప్పుడు ఆమెను బలవంతపెట్టొద్దని మను అంటాడు. అయినా ఏంజెల్ పట్టువీడదు.
ఫొటో తీయాల్సిందే అంటుంది. సెల్ఫీలో మను కట్ అవుతుండటంతో అతడిని అనుపమకు దగ్గరగా జరగమని ఏంజెల్ అంటుంది. ఆమె చెప్పినట్లే చేస్తాడు మను. ఫొటో తీస్తుంది ఏంజెల్. అనుపమకు పొలమారడంతో మను స్వయంగా నీళ్లు తాగిస్తాడు.
మహేంద్ర రిక్వెస్ట్...
భోజనం చేసిన తర్వాత మను ఇంటికి వెళ్లబోతాడు. అతడిని మహేంద్ర ఆపేస్తాడు. ఇక్కడే ఉండమని పట్టుపడతాడు. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్లమని అంటాడు. ఎంత బతిమిలాడిన మహేంద్ర ఇంట్లో ఉండటానికి మను ఒప్పుకోడు.
గెంటేయడం…స్వాగతించడం…
ఇంటి బయటకు వెళ్లిన మను తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. మీతో మాట్లాడాలని వసుధార ఉదయం తనకు ఫోన్ చేసిన సంగతి గుర్తొస్తుంది. అదేమిటో కనుక్కోవాలని అనుకుంటాడు. కాలేజీలో జరిగిన గొడవలో మీ తప్పు లేదని తేలింది కదా...మళ్లీ కాలేజీకి వచ్చేయమని మనుతో అంటుంది వసుధార.
కాలేజీ నుంచి గెంటేయడం, స్వాగతించడం రెండు మీ వంతేనా అని వసుధారతో అంటాడు మను. అంత జరిగిన తర్వాత మళ్లీ కాలేజీకి ఎలా రాగలను, నాకు ఆత్మాభిమానం, మనసు ఉన్నాయని మను అంటాడు.
ఒకవేళ కాలేజీకి వచ్చిన మళ్లీ నన్ను అపార్థం చేసుకొని కాలేజీ నుంచి వెళ్లమనరని గ్యారెంటీ ఉందా అని వసుధారను అడుగుతాడు మను. నన్ను కాలేజీకి రావొద్దని చెప్పింది అనుపమ. తను ఎప్పుడు ఏది చెప్పిన పాటిస్తానని మను అంటాడు.
అనుపమను ఒప్పిస్తే...
అనుపమను ఒప్పిస్తే తిరిగి కాలేజీకి వస్తారా అని మనును అడుగుతుంది వసుధార. ఆమెను బలవంతంగా ఒప్పించిన మనస్ఫూర్తిగా అక్కడ పనిచేయలేనని, కాలేజీకి వచ్చి పదే పదే తాను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వసుధారతో అంటాడు మను. ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దేవయాని గెస్...
మను, అనుపమల మధ్య గొడవ గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది దేవయాని. చివరకు తన తండ్రి ఎవరన్నది మనుకు ఇప్పటికి తెలియదని దేవయాని ఫిక్స్ అవుతుంది. తండ్రి గురించి మనకు తెలిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయోనని కొడుకు దగ్గర అనుపమ ఈ విషయం దాచి ఉంటుందని ఊహిస్తుంది. ఆ తండ్రి ఎవరో చెప్పకూడదని వ్యక్తి అయి ఉంటాడని గెస్ చేస్తుంది.
తండ్రి విషయంలో అనుపమను మను గట్టిగా నిలదీయడమే వారి మధ్య గొడవకు కారణమని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. తండ్రి విషయంలో జరిగిన గొడవ వల్లే ఇద్దరి మధ్య మాటలు లేవని అనుకుంటుంది. ఈ గొడవను ఉపయోగించుకుంటూ మను అడ్డును తొలగించాలని శైలేంద్ర, దేవయాని ఫిక్స్ అవుతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.