Guppedantha Manasu February 2nd Episode: భద్రను పోలీసులకు పట్టించిన వసు - శైలేంద్ర షాక్ - రిషి కోసం మహేంద్ర ఆరాటం
Guppedantha Manasu February 2nd Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి అడ్రెస్ తెలుసుకొని అతడిని కలవడానికి వెళుతున్న వసుధార సీక్రెట్‌గా ఫాలో అవుతాడు భద్ర. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది వసుధార. ఇదంతా తన ట్రాప్ అని చెప్పి భద్రను జైలుకు పంపిస్తుంది.
Guppedantha Manasu February 2nd Episode: వసుధార వల్లే కాలేజీ పతనమవుతుందని, ఆమెను ఎండీ సీట్ నుంచి తొలగించాలని బోర్డ్ మెంబర్స్ గొడవ చేస్తారు. కానీ మినిస్టర్ మాత్రం వసుధారనే సపోర్ట్ చేస్తాడు. వసుధార తప్ప ఎండీ పదవికి అర్హులు ఎవరూ కాలేజీలో కనిపించడం లేదని చెప్పి శైలేంద్రకు షాకిస్తాడు. ఎండీ పదవికి వసుధార అర్హురాలు అని ఓ సారి...అనర్హురాలు అంటూ మరోసారి బోర్డ్ మెంబర్స్ మాట మారుస్తుండటం చూసి మహేంద్ర ఫైర్ అవుతాడు. శైలేంద్ర వల్లే వాళ్లు అలా మాట్లాడుతున్నారని, పదవి కోసం శైలేంద్ర వారిని ప్రభావితం చేస్తున్నాడని వసుధార అంటుంది.

రిషి దూరమైన బాధతో మహేంద్ర విలవిలలాడుతాడు. రిషి ఏమయ్యాడో...ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తలచుకుంటే గుండె పగలిపోతుందని ఎమోషనల్ అవుతాడు. కన్న కొడుకు ప్రమాదంలో ఉన్నా అతడిని కాపాడలేకపోతున్నా. అతడి బాగోగులు కూడా చూసుకోలేకపోతున్నా.. ఇలాంటి జీవితం నాకు ఎందుకు... నా బ్రతుకు ఎందుకు అంటూ ఆవేదనకు లోనవుతాడు. మీరు అలా మాట్లాడొద్దు. రిషికి ఏం కాదు. త్వరలోనే అతడు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని మహేంద్రను ఓదార్చుతుంది వసుధార.
మహేంద్ర కాళ్లపై పడ్డ చక్రపాణి...
మీ బాధకు కారణం నేనే...నా వల్లే ఇలా జరిగింది. క్షమించమని మహేంద్ర కాళ్లపై పడతాడు చక్రపాణి. శత్రువులు దొంగ దెబ్బ తీస్తే మీరేం చేయగలరని మహేంద్ర బదులిస్తాడు. శైలేంద్ర గురించి తెలిసిన మేమే ఏం చేయలేకపోతున్నామని అంటాడు. రిషికి ఎలాంటి ఆపద రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నానని, కానీ తాను రిషి పక్కన ఉండగానే అతడిని ఎవరో కిడ్నాప్ చేశారని చక్రపాణి బాధపడతాడు. అప్పుడే వసుధారకు ఓ ఫోన్ వస్తుంది. రిషి గురించి తెలిసిందా ఇప్పుడే వస్తున్నా అంటూ వసుధార హడావిడిగా బయలుదేరుతుంది.
శైలేంద్ర ఆనందం...
వసుధార మాటలు విన్న భద్ర శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. రిషి జాడ వసుధారకు తెలిసిసోయిందని అతడిని కలవడానికి వెళుతుందని చెబుతాడు. ఇద్దరిని ఒకేసారి లేపేస్తానని శైలేంద్రతో అంటాడు. రెండు ఐస్ బాక్స్‌లు రెడీ చేసుకొని పెట్టుకోమని శైలేంద్రకు చెబుతాడు. వసుధారను ఫాలో అవుతాడు భద్ర. వసుధార, రిషి పైకి పోతే తనకు అడ్డు ఎవరూ ఉండరని, డీబీఎస్‌టీ కాలేజీకి తానే ఎండీగా కావచ్చునని శైలేంద్ర ఆనంద పడతాడు.
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భద్ర...
ఓ చోట కారును ఆపిన వసుధార నడచుకుంటూ వెళుతుంది. భద్ర తనను ఫాలో అవుతోన్న సంగతి వసుధార కనిపెడుతుంది. భద్రను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని రెండు చెంపలు వాయిస్తుంది. నువ్వు వెధవవని నాకు ముందే తెలుసు అని భద్రతో అంటుంది వసుధార. తెలిస్తే ఇప్పుడు నువ్వేం చేయగలవు. ఏం చేయలేవు అని వసుధారను భయపెట్టాలని చూస్తాడు భద్ర. కానీ అక్కడికి ముకుల్ ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి భద్ర షాకవుతాడు. పోలీసులు భద్రను చుట్టూ ముడతారు.
ముకుల్ వార్నింగ్...
ఏం సంబంధం లేకుండా వసుధార ఇంట్లో చేరిన రోజే నీపై అనుమానం వచ్చింది. నువ్వు ఏదో ఒక రోజుమాకు దొరుకుతావని నాకు తెలుసునని భద్రతో అంటాడు ముకుల్. తానే ఏం తప్పు చేయలేదని, ఎలా అనుమానిస్తారని భద్ర బుకాయిస్తాడు. ఎక్కువగా మాట్లాడితే కాల్చిపడేస్తానని భద్రను గన్ తీసి బెదిరిస్తాడు ముకుల్. నువ్వు మంచోడివా మోసగాడివా అన్నది తాను తేలుస్తానని అంటాడు. వసుధార మొబైల్‌లోని వీడియోను నువ్వే డిలేట్ చేశావని నాకు తెలుసు భద్రతో అంటాడు ముకుల్. నీకు ట్రీట్‌మెంట్ ఇస్తే అన్ని నిజాలు బయటపడతాయని వార్నింగ్ ఇస్తాడు.
భద్ర యాక్టింగ్...
తాను మోసగాడిని కాదని, రౌడీల నుంచి మిమ్మల్ని కాపాడానని వసుధార ముందు మంచోడిలా నటించడానికి ప్రయత్నిస్తాడు. నీ ఆస్కార్ పర్ఫార్మెర్స్ ఆపేయమని భద్రతో అంటుంది వసుధార. అతడి కుట్రలను మొత్తం బయటపెట్టేస్తుంది వసుధార. పోలీసులు భద్రను జైలుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. జీవితంలో ఫస్ట్ టైమ్ నన్ను పోలీసులకు పట్టించావు. దీనికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటా. నిన్ను రిషిని వదలను అంటూ వసుధారకు వార్నింగ్ ఇస్తాడు.
శైలేంద్ర షాక్...
భద్ర పెట్టిన లొకేషన్‌కు శైలేంద్ర వస్తాడు. అక్కడ భద్ర కనిపించకపోవడంతో అతడి కోసం వెతుకుతుంటాడు. సడెన్‌గా అక్కడ వసుధార ప్రత్యక్షమవుతుంది. ఏం వెతుకుతున్నావని శైలేంద్రను అడుగుతుంది. వసుధార మాటలతో శైలేంద్ర షాకవుతాడు. తడబడిపోతాడు. నా కోసం వెతుకుతున్నావా...లేదంటే భద్ర కోసం వెతుకుతున్నావా అని శైలేంద్రను అడుగుతుంది వసుధార. భద్ర ఎవరో తనకు తెలియదని బుకాయిస్తాడు శైలేంద్ర. నీ వేషాలు, మోసాలు,అబద్ధాలు చూసి చూసి విసిగెత్తిపోయింది. భద్ర నీ మనిషే అని తెలుసు. అందుకే అతడిని భద్రంగా సాగనంపాను శైలేంద్రకు చెప్పి షాకిస్తుంది వసుధార.
వసుధార ప్రశ్నలు..
నా కోసం కాకుండా, భద్ర కోసం కాకుండా ఇక్కడికి ఎందుకొచ్చావని శైలేంద్రను నిలదీస్తుంది వసుధార. ఏం సమాధానం చెప్పాలో తెలియక తబడిపోతాడు శైలేంద్ర. వాకింగ్ చేయడానికి వచ్చానని అబద్ధం ఆడుతాడు. అయినా అతడిని వదిలిపెట్టదు వసుధార. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెడుతుంది. వసుధార ప్రశ్నలతో శైలేంద్ర టెన్షన్ పడతాడు. చివరకు ధైర్యం తెచ్చుకొని నా మనసు ప్రశాంతంగా ఉండటానికి ఎంత దూరమైన వెళతాను అని అంటాడు.
శైలేంద్రకు అవమానం...
బుద్ది సరిగా లేనప్పుడు ఎంత వాకింగ్ చేసిన ఉపయోగం ఉండదు. ముందు బుద్ది సరిచేసుకో అంటూ శైలేంద్రను అవమానిస్తుంది వసుధార. ఆమె మాటలతో శైలేంద్ర ఫైర్ అవుతాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావని, ఇదే కంటిన్యూ అయితే నీకే ప్రమాదమని వసుధారను హెచ్చరిస్తాడు శైలేంద్ర. నా మాటలు ఇలాగే ఉంటాయని శైలేంద్రకు ధీటుగా బదులిస్తుంది వసుధార. నువ్వు ప్రమాదాలు సృష్టించడం వాటి నుంచి బయటపడటం నాకు కొత్త కాదని అంటుంది.
వసుధార ట్రాప్...
భద్ర నీ మనిషి అని పక్కా నాకు తెలుసు అని శైలేంద్రతో అంటుంది వసుధార. ట్రాప్ చేసి పోలీసులకు అతడిని ఎటా పట్టించింది శైలేంద్రకు చెబుతుంది వసుధార. రిషి గురించి తెలుసు అంటూ భద్ర ముందు కావాలనే నాటకం ఆడాను. అది నిజమని నమ్మి భద్ర నీకు ఫోన్ చేసి నా డెడ్‌బాడీని చూడటానికి ఇక్కడికి రమ్మన్నాడని నాకు తెలుసు అని భద్రతో కలిసి శైలేంద్ర చేసిన కుట్రలు మొత్తం బయటపెట్టేస్తుంది వసుధార. భద్రను ముకుల్ అరెస్ట్ చేసినట్లు చెప్పగానే శైలేంద్ర భయపడిపోతాడు. నిజాలు వెలికితీసే వరకు భద్రను ముకుల్ అసలు వదిలిపెట్టడని అంటాడు. వసుధార చెబుతోన్న మాటలు విని శైలేంద్ర భయం ఇంకా పెరుగుతుంది.
రిషిని ఎక్కడ దాచావని శైలేంద్రను నిలదీస్తుంది వసుధార. రిషిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకు తప్ప ఎవరికి లేదని వసుధార అంటుంది. రిషి గురించి తనకు ఏం తెలియదని శైలేంద్ర బదులిస్తాడు. నువ్వు చెప్పిన చెప్పకపోయినా రిషి ఆచూకీ తాను కనుక్కుంటానని వసుధార అంటుంది. ఆ తర్వాత అందరి ముందు దోషిగా నిలబడటానికి రెడీగా ఉంటూ శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.