Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు ఫేర్‌వెల్ పార్టీ.. లైఫ్ ఇచ్చిన సీరియల్ అంటూ ఎమోషనల్ అయిపోయిన రిషి, వసు
Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు సీరియల్ ఫేర్‌వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఈ సీరియల్ తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిదంటూ లీడ్ రోల్స్ అయిన రిషి, వసు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఈ సీరియల్ శనివారం (ఆగస్ట్ 31) ముగిసిన విషయం తెలిసిందే.
Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు.. ఈ మధ్య కాలంలో తెలుగు వారికి బాగా నచ్చిన సీరియల్స్ లో ఇదీ ఒకటి. పడుతూ లేస్తూ చివరికి అందరినీ ఎమోషనల్ చేస్తూ ఈ సీరియల్ గత శనివారం (ఆగస్ట్ 31) ఎపిసోడ్ తో ముగిసింది. ఈ సందర్భంగా సీరియల్ టీమ్ మొత్తం ఫేర్‌వెల్ పార్టీ చేసుకోగా.. ఇందులో లీడ్ రోల్స్ అయిన రిషి, వసు పాత్రధారులు ముఖేష్, రక్ష ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు.
గుప్పెడంత మనసు ఫేర్‌వెల్ పార్టీ
నాలుగేళ్లు, 1168 ఎపిసోడ్ల పాటు సాగిన గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డు పడిన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 1) జరిగిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో భాగంగా గుప్పెడంత మనసు టీమ్ ఫేర్‌వెల్ పార్టీ కూడా జరిగింది. దీనికి టీమ్ మొత్తం హాజరైంది.
ఈ షో చివర్లో సీరియల్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రిషి పాత్ర పోషించిన ముఖేష్ గౌడ, వసుధార పాత్ర పోషించిన రక్ష గౌడతోపాటు సీరియల్లో ప్రధాన పాత్రధారులందరూ ఈ పార్టీకి వచ్చారు. ఇందులో వాళ్లు స్పెషల్ గుప్పెడంత మనసు థీమ్ తో రూపొందించిన టీషర్ట్స్ ను వేసుకున్నారు.
రిషి, వసు ఎమోషనల్
ఈ ఫేర్‌వెల్ పార్టీ సందర్భంగా రిషి, వసు పాత్రలు పోషించిన ముఖేష్, రక్ష గౌడ ఎమోషనల్ అయిపోయారు. ఒకరి టీషర్ట్ పై మరొకరు ఫేర్‌వెల్ మెసేజ్‌లు రాసిన తర్వాత ఈ ప్రాజెక్టుతో తమకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. రక్ష తన లక్కీయెస్ట్ హీరోయిన్ అని ఆమె టీషర్ట్ పై రాయడంతోపాటు ఆమెను హగ్ చేసుకొని ఇదే విషయం చెప్పాడు ముఖేష్.
సీరియల్ లో లీడ్ రోల్స్ పోషించిన ముఖేష్ గౌడ, రిషి గౌడ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వాళ్లే కావడం విశేషం. ఈ సీరియల్లోని అందరూ ఓ ఫ్యామిలీగా మారిపోయారని, వాళ్లందరి మిస్ అవుతామని రక్ష కంటతడి పెట్టింది. అటు ముఖేష్ గౌడ మాట్లాడుతూ.. ఈ సీరియల్ అందరికీ పేరు తెస్తే తనకు లైఫ్ ఇచ్చిందని అన్నాడు.
ఈ సందర్భంగా గతేడాది కన్నుమూసిన తన తండ్రిని గుర్తు చేసుకొని అతడు భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి మరణించే ముందు ఆయన కళ్ల ముందే తనకు అవార్డు ఇవ్వడం గర్వంగా ఉందని అన్నాడు. ఈ సీరియల్ ను సూపర్ హిట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. రక్ష తన లక్కీయెస్ట్ హీరోయిన్ అని అన్నాడు.
గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు సీరియల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోవాలని ముఖేష్ గౌడ ఆకాంక్షించాడు. ఇక ఫేర్‌వెల్ పార్టీ సందర్భంగా ఐదుగురు లక్కీ అభిమనులకు సీరియల్ ప్రత్యేక టీషర్ట్స్‌ను కూడా ఇవ్వడం విశేషం. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గుప్పెడంత మనసు సీరియల్ ఇలా..
గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 7, 2020న ప్రారంభమైంది. సుమారు నాలుగేళ్ల పాటు ఏకంగా 1168 ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ అలరించింది. మొత్తానికి శనివారం (ఆగస్ట్ 31) చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది.
ఒక దశలో టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్ సాధించిన ఈ సీరియల్ మధ్యలో కొన్ని ఒడుదుడుకులు కూడా ఎదుర్కొంది. సీరియల్ టైమింగ్స్ ను కూడా అప్పుడప్పుడూ మార్చారు. మొత్తానికి సీరియల్ చివరికి వచ్చే సరికి మరోసారి మంచి రేటింగ్స్ తోనే ముగించింది. ఈ సీరియల్ ను అభిమానులు చాలా మిస్ కాబోతున్నారు.